
చంద్రబాబుకు దళితులపై అక్కసు ఎందుకు?
చీరాల టౌన్: ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబునాయుడు దళితులను కుక్కలతో పోల్చి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. దళితులంటే సీఎంకు ఎందుకు అంత చిన్నచూపు? దళితుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’ అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు డిమాండ్ చేశారు. శనివారం చీరాల ఒన్‌టౌన్ సీఐ సుబ్బారావును వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్, వైఎస్సార్‌సీపీ నాయకులు కలిసి చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వాసిమళ్ల వాసు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, పట్టణాధ్యక్షుడు యాతం మేరిబాబులు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడుకు దళితులంటే ఎప్పుడూ చులకన భావమేనని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సింగయ్యను కుక్కతో పోల్చడం దుర్మార్గమన్నారు. దళితుల ఓట్లు కావాలని.. కానీ వారు కుక్కలంటూ అగ్రవర్ణ భావజాలంతో, పదవీ అహంకారంతో మాట్లాడిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెడ్‌బుక్ పాలనలో ప్రజలు, పార్టీల నాయకులును వేధిస్తూ దుర్మార్గ పాలన చేస్తున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్న హయాంలో గోదావరి పుష్కరాల సమయంలో చాలామంది చనిపోయారని, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా కందుకూరు, ఇతర ప్రాంతాల్లో ప్రజలు చనిపోయినా కనీసం స్పందించకుండా దుర అహంకారాన్ని ప్రదర్శించారన్నారు. వైఎస్సార్ సీపీలో దళితులకు సముచిత స్థానం ఇచ్చి ఉన్నత పదవులు కట్టబెటితే.. చంద్రబాబు మాత్రం దళితులను కుక్కలతో పోల్చడం హేయమన్నారు. ఇదే పంథా కొనసాగిస్తే చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిలర్లు కంపా అరుణ్, బత్తుల అనీల్, పార్టీ నాయకులు గవిని శ్రీనివాసరావు, కోడూరి ప్రసాద్‌రెడ్డి, రాఘవ, వాసిమళ్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు