‘నల్లబర్లీ’ పూర్తిగా కొనాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

‘నల్లబర్లీ’ పూర్తిగా కొనాల్సిందే..!

Jul 4 2025 3:46 AM | Updated on Jul 4 2025 3:46 AM

‘నల్లబర్లీ’ పూర్తిగా కొనాల్సిందే..!

‘నల్లబర్లీ’ పూర్తిగా కొనాల్సిందే..!

జె.పంగులూరు: ప్రభుత్వం మార్కెఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్న రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిణి వినోద్‌బాబు డిమాండ్‌ చేశారు. పంగులూరులోని మార్కెట్‌ యార్డులు ఏర్పాటు చేసిన నల్లబర్లీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు పరిశీలించారు. అక్కడ ఉన్న రైతుల వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ సందర్భంగా రామారావు, వినోద్‌బాబులు మాట్లాడుతూ నిబంధనల పేరుతో పొగాకు చెక్కులను వెనక్కి పంపటం మానుకోవాలని, రైతులు తెచ్చిన పొగాకు చెక్కులు మొత్తం ఆలస్యం చేయకుండా కొనాలని కోరారు. రైతులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి పొగాకు చెక్కులు కొనుగోలు కేంద్రానికి తీసుకొని వస్తే, ఇక్కడ నిబంధనల పేరుతో చెక్కులు వెనక్కి పంపుతున్నారని మండి పడ్డారు. మంచి గ్రేడ్‌ ఉన్న పొగాకు కూడా తక్కువ ధర వేస్తున్నారన్నారు.

వెనక్కి పంపితే మరింత భారం..

రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న పొగాకు చివరి ఆకు కూడా కొంటామని చెబుతోందని, కానీ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న నిబంధనలు రైతులకు మేలు చేసేవిగా లేవన్నారు. రైతులు గత నాలుగు నెలలు నుంచి తమ పంటను అమ్ముకోవాలని చూశారన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చి తమ పేరు రాగానే చెక్కులు తీసుకొని మార్కెట్‌ యార్డు వద్దకు రాగా వివిధ కారణాలతో సగానికి సగం చెక్కులు వెనక్కి పంపుతున్నారని ఆరోపించారు. గ్రేడ్‌ చేసుకొన్ని చెక్కులు తీసుకొని వస్తే, మళ్లీ వాటిని వెనక్కి పంపుతున్నారని, తిరిగి వాటిని గ్రేడ్‌ చేసి చెక్కులు తొక్కితే రైతులకు మరింత భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నష్టపోకుండా మేలు చేసేవిధంగా చూడాలన్నారు. పొగాకు నాణ్యతను బట్టి మూడు గ్రేడ్లు చేసిన, ధరలు మాత్రం అతి తక్కువగా వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్‌ సింగారావు దృష్టికి వియాన్ని తీసుకు వెళ్లారు. కార్యక్రమంలో రైతులు గుడిపాటి మల్లారెడ్డి, తానికొండ సుధాకర్‌, తలపనేని స్వామి, రావెళ్ల ఉమామహేశ్వరరావు, చుక్కా కాంతయ్య, మదాల సాంబశివరావు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

నిబంధనల పేరుతో పొగాకు చెక్కులను వెనక్కి పంపితే సహించం ప్రభుత్వం వ్యాపార పరంగా కాకుండా, రైతులకు మేలు జరిగేలా కొనాలి రైతు సంఘం నాయకుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement