కష్టాలే! | - | Sakshi
Sakshi News home page

కష్టాలే!

Jul 1 2025 4:16 AM | Updated on Jul 1 2025 4:16 AM

కష్టాలే!

కష్టాలే!

చదువుకొనాలంటే
● విద్యా సామగ్రి పేరిట అదనపు వసూళ్లు ● ఫీజుల నియంత్రణపై దృష్టి కరవు ● విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టి సారించని విద్యాశాఖ

చీరాల: తాము పడిన కష్టం పిల్లలు పడకూడదని, మంచి స్థాయికి రావాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. కన్నబిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు ఆరాటపడుతుంటారు. కొంతమంది తమ స్థాయికి మించి ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆరాటాన్ని ఆసరా చేసుకుని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో, విద్యాసామగ్రి పేరిట అందినకాడికి దోచుకుంటున్నారు. ఫీజుల కంటే ఇతర విద్యా సామగ్రి కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారమవుతుంది. చదువుకునే రోజుల నుంచి చదువుకొనే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.

ఇష్టానుసారంగా యాజమాన్యాలు

జిల్లాలో 300కి పైగా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలున్నాయి. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయికి తీర్చిదిద్దారు. అవి నేడు కానరాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల బాటపడుతున్నారు. ఫలితాలు, ర్యాంకులను బేరీజు వేసుకుంటూ సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ పాఠశాలకు అత్యధిక మార్కులు వచ్చాయి, మా స్కూల్‌లో చేర్పిస్తే మీ పిల్లల భవిష్యత్‌ బాగుంటుందంటూ క్యాంపెయిన్‌ చేసి తల్లిదండ్రులను తమ వైపు తిప్పుకుంటున్నారు. కనీసం ఆట స్థలం కూడా లేకుండా ఇరుకు గదుల్లో, బహుళ భవనాల్లో పాఠశాలలను నిర్వహిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రుల కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి. వారు నిర్ణయించిన ఫీజులే చెల్లించాలని, వేరే వారి కంటే తామే తక్కువ తీసుకుంటున్నామని బురిడీ కొట్టిస్తున్నారు.

విద్యాహక్కు చట్టం అమలయ్యేనా?

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో 25 శాతం ఉచిత విద్యనందించాలి. ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే పదో తరగతి వరకు వెసులుబాటు ఉంటుంది. ఒకటో తరగతిలో అడ్మిషన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో లాటరీ విధానంలో విద్యార్థులకు పలు పాఠశాలల్లో ప్రవేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విధానం రెండు ఫేజ్‌లలో జరిగింది. జిల్లాలో మొదటి ఫేజ్‌లో 243 మంది దరఖాస్తు చేసుకోగా 169 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. రెండో ఫేజ్‌లో 68 మందికిగాను 58 మంది అడ్మిషన్‌లు తీసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వం కొంత మేరకు మాత్రమే ఫీజు చెల్లిస్తుంది. పూర్తిగా చెల్లించకపోవడంతో మిగిలిన డబ్బులు తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంది. అలానే బస్సు, ఫుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, అదనపు తరగతులకు ప్రత్యేక ఫీజులంటూ బాదుడు షరా మామూలే. పలుకుబడి గట్టిగా ఉండి సిఫార్సులు ఉంటే అడ్మిషన్లు అవుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నా యి. ఆర్టీఈ ప్రకారం అడ్మిషన్లు అనగానే యాజమాన్యాలు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీఈ ద్వారా కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నా వాటి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతుంది. అడ్మిషన్ల సమయంలో హడావిడి చేసే విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఏయే పాఠశాలలో ఎన్ని ప్రవేశాలు కల్పించారనే వివరాలను మాత్రం వెల్లడించడంలేదు. విద్యాశాఖ అధికారులు కూడా ఆర్టీఈ సక్రమంగా అమలవుతుందా అనేది పరిశీలన చేయడం అవసరం.

పిల్లల చదువులపై ఫీజుల పంజా

విద్యాసామగ్రి పేరిట మరో దోపిడీ

ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో ఫీజులే ఎక్కువగా వసూలు చేస్తున్నారనుకుంటే విద్యాసామగ్రి పేరిట కూడా మరో దోపిడీ జరుగుతుంది. నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు సైతం తమ వద్దనే తీసుకోవాలని సూచిస్తున్నారు. పుస్తకాలు, ఇతర సామగ్రి విక్రయించవద్దని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్న అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాం, బెల్టు, టై, చివరకు పుస్తకాలు వేసే అట్టలు వంటి స్టేషనరీలను విద్యార్థుల తరగతిని బట్టి రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకటో తరగతికి అవసరమయ్యే విద్యాసామగ్రి రూ.5 వేల వరకు అవుతుంది. మేము ఇచ్చే సామగ్రి బయట దొరకదని, మా వద్దనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. బయట కొనుగోలు చేస్తానంటే ఒప్పుకోని పరిస్థితి. దీంతో తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతోంది.

అధిక ఫీజులపై ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం..

ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫాం, పుస్తకాలు విక్రయించరాదు. అధిక ఫీజులు వసూలు చేసి, పుస్తకాలు, యూనిఫాం స్కూల్‌లోనే కొనాలని స్కూల్‌ యాజమాన్యం ఇబ్బంది పెడితే తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే వారిపై స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం.

– డీ గంగాధరరావు, డిప్యూటీ డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement