
సిఫార్సు బదిలీలు!
నెహ్రూనగర్: ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటేనే మొదటి ప్రాధాన్యతగా బదిలీలు ఉంటాయని జీఎస్‌డబ్ల్యూఎస్, పోలీసు అధికారులు తెగేసి చెబుతున్నారు. ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీసులకు ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బదిలీల కౌన్సిలింగ్ జరిగింది. అయితే ఈ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా, పారదర్శకత లేకుండా కేవలం సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం ఇస్తూ జరుగుతున్నాయని పలువురు మహిళా పోలీసులు ఆరోపిస్తున్నారు.
సిఫార్సు ఉన్నవారికే ప్రథమ ప్రాధాన్యం
2019లో సచివాలయ మహిళా పోలీసులకు వచ్చిన ర్యాంకు, వారి అర్హత, టెక్నికల్ క్వాలిఫికేషన్ బట్టి వారికి ఆయా సచివాలయాల్లో పోస్టింగ్ కల్పించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో కేవలం వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే బదిలీలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఆ విధంగా కాకుండా ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికై నా బదిలీ చేస్తామని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఒక వేళ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఖరాకండిగా చెబుతుండంతో సిఫార్సు లేఖలు తెచ్చుకోలేని మహిళా పోలీసులు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
ఒక్కో లేఖకు రూ.50వేల దాకా వసూలు
ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 1100 మంది దాకా మహిళా పోలీసులు ఉన్నారు. వీరందరికీ ఆదివారం కౌన్సెలింగ్ జరిగింది. అయితే ఇందులో రూరల్ ప్రాంతంలో పనిచేసే మహిళ పోలీసులు అర్బన్ ప్రాంతానికి వచ్చేందుకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకుంటున్నారు. ఒక్కో సిఫార్సు లేఖకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేసి ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి గుంటూరు నగరంలో పోస్టింగ్ కోసం ఒక్కో మహిళా పోలీసు 5 నుంచి 10 దాకా వారి వారి పలుకుబడిని బట్టి తెచ్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనారోగ్యం, సీనియార్టీ, ర్యాంక్‌తో పనిలేదు?
ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో మొదటి ప్రాధాన్యతగా దివ్యాంగులకు, విజువల్లీ ఛాలెంజడ్, కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ వంటి రోగులతో పాటు, స్పౌజ్ కేటగిరి వారికి ప్రాధ్యానం ఇవ్వాలి. కేవలం ఎమ్మెల్యే సిఫార్సు లేఖలే పనిచేస్తుండడంతో చాలా మంది అర్బన్‌లో పనిచేస్తున్న మహిళా పోలీసులు రూరల్‌కు బదిలీ అవుతామేమోననే భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు.
గుంటూరు జిల్లా పోలీస్
కార్యాలయంలో మహిళా
పోలీసుల బదిలీల కౌన్సెలింగ్
అనారోగ్యం, సీనియార్టీ, ర్యాంక్‌తో
పనిలేకుండా ఎమ్మెల్యేల సిఫార్సు
లేఖ ఉన్నవారికే ప్రాధాన్యం!
గుంటూరు సిటీకి వచ్చేందుకు ఒక్కో లేఖకు రూ.50వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు
ఆందోళనలో మహిళా పోలీసులు