అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయాం
జె.పంగులూరు: అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన పచ్చాకు ముఠా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు సీపీఎం ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు ఉబ్బా వెంకటేశ్వర్లు కోరారు. గురువారం ముప్పవరం గ్రామంలోని బహిరంగ సభ వద్ద మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కలిసి వెంకటేశ్వర్లు వినతిపత్రం ఆందజేశారు. కొరిశపాడు మండలం ప్రాసంగలపాడు గ్రామానికి చెందిన పంది కుటుంబాలు పచ్చాకు కార్మికులు నెల్లూరు జిల్లా మర్రిపూడి మండలం డీజీపేట గ్రామంలో పొగాకు పనికి వెళ్లారని, గత మార్చి నెల 31 వ తేదిన ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో, కూలీలు నివాసం ఉంటున్న గుడిసెలు తగలబడిపోయి, అందులో గ్యాస్ సిలిండర్లు పొయ్యిలు, బట్టలు, డబ్బులు, సరుకులు, వంట పాత్రలు మొత్తం తగలబడిపోయి కట్టుబట్టతో మిగిలి పోయారన్నారు. రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోయిన పచ్చాకు కార్మికులకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఈ విషయమై ఈ పాటికే కలెక్టర్‌తో మాట్లాడానని, తప్పకుండా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాకళాకారుడు నందవరపు జాన్ సాహెబ్ ఉన్నారు.
పచ్చాకు ముఠా కార్మికులను ఆదుకోండి మంత్రి గొట్టిపాటికి సీపీఎం నేత ఉబ్బా వెంకటేశ్వర్లు నేతృత్వంలో వినతి


