చదరంగంతో పెరగనున్న మేధాశక్తి
గుంటూరు ఎడ్యుకేషన్: భారతదేశంలో పురాతన ఆటగా మొదలైన చదరంగం అంతర్జాతీయ స్థాయిలో నేడు ప్రముఖ క్రీడగా గుర్తింపు పొందిందని గుంటూరు జిల్లా ఇన్‌టాక్ కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో సోమవారం జిల్లా స్థాయి చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బాలబాలికలకు చిన్న వయసు నుంచే చదరంగంలో మెళకువలను నేర్పాలని తెలిపారు. ఆట ద్వారా వ్యూహాత్మక ఎత్తుగడల నైపుణ్యత, మేధో పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం ఏర్పడి ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని వివరించారు. భారతీయ విద్యా భవన్స్ కార్యదర్శి పి.రామచంద్రరాజు మాట్లాడుతూ భవన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ పోటీల్లో జిల్లావ్యాప్తంగా 150 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని నైపుణ్యాలను ప్రదర్శించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ కోశాధికారి కేతరాజు సుభాష్, ప్రిన్సిపాల్ హేమాంబ, ఆనంద్ చెస్ అకాడమీ నిర్వాహకుడు గోపి పాల్గొన్నారు.


