రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కారంచేడు: వ్యాపార నిమిత్తం చీరాలకు తన ద్విచక్ర వాహనంపై వెళుతున్న కూరగాయల వ్యాపారి ప్రమాదంలో మరణించాడు. కారంచేడు ఎస్‌ఐ వి. వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన వేమా శివయ్య (57) తన ద్విచక్ర వాహనంపై కూరగాయలు, ఆకు కూరలు ఊరూరు తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ప్రతి రోజూ ఆయన నూతలపాడు నుంచి చీరాలకు ద్విచక్ర వాహనంపై వచ్చి మార్కెట్‌లో కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసుకొని తిరిగి వెళ్ళి అక్కడ అమ్ముకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో బుధవారం కూడా ఆయన చీరాలకు బయలు దేరాడు. వాడరేవు–పిడుగురాళ్ళ ప్రధాన రహదారిలో కారంచేడు–చీరాల మార్గంలో హోలి చర్చ్ సమీపంలో ఎదురుగా వస్తున్న గేదెలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు 108కు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి చీరాల ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి మృతి చెందాడని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.


