పురావస్తు మ్యూజియం కలేనా?
కనుమరుగవుతున్న చారిత్రక ఆనవాళ్లు పరిరక్షణకు చర్యలు తీసుకోని పురావస్తు శాఖ పదేళ్ల క్రితం పురావస్తు మ్యూజియం కోసం ప్రతిపాదనలు అద్దంకిలో క్రీస్తు పూర్వం నాటి కట్టడాలు
పురావస్తు మ్యూజియం అవసరం
అద్దంకి: పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఆనవాళ్లను భద్రపరచి, భావి తరాలు చూసేందుకు ఉపయోగపడే పురావస్తు మ్యూజియం ఏర్పాటు కలగానే మిగిలింది. గతంలో పురావస్తు శాఖ మ్యూజియం ఏర్పాటు చేస్తామని మాటిచ్చి ప్రతిపాదనలు తయారు చేసి పంపినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఏటికేడు పురాతన ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చరిత్ర పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అద్దంకి కోటకు అనవాళ్లు కనుమరగయ్యాయని చెబుతున్నారు.
పురాతన కట్టడాలు..
అద్దంకి పట్టణం క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నుంచే ఉన్నట్లు ఇక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. తరువాత వివిధ రాజవంశాలు అద్దంకి రాజధానిగా చేసుకుని రాజ్య పాలన చేశాయి. ఇక్కడ బ్రిటిష్ కాలంనాటి నిర్మాణాలున్నాయి. పురాతన కట్టడాల విషయానికొస్తే చోళుల కాలం నాటి వేయి స్తంభాల దేవాలయం, 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన నాట్య గణపతి ఆలయం, 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించిన పాత శివాలయం(రామలింగే శ్వరాలయం) ఇక్కడే అగస్త్య మహాముని ప్రష్టించిన అగస్తేశ్వరాలయం, పోతురాజు గండిలో తొమ్మిది విగ్రహాలు, రెడ్డిరాజుల కాలం కాకానిపాలెంలోని కోదండరామస్వామి ఆలయం, నాంచారమ్మ ఆలయం(పోలేరమ్మ), రంగనాయకుల ఆలయం, 16వ శతాబ్దానికి చెందిన నరసింహ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, 13వ శతాబ్దం నాటి గాడిద శాసనం, క్రీస్తు పూర్వ 848లోని పండరగని తొలి తెలుగు పద్య శాసం, 1902లో నిర్మించిన విక్టోరియా మహారాణి సత్రం, 1920లో నిర్మించిన ప్రభుత్వ వైద్యశాల, 1850లో నిర్మించిన పోలీస్‌స్టేషన్, 1930లో నిర్మించిన తాలూకా ఆఫీసు, క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నాటి సమాధులు, ధర్మవరం కొండపైని బౌద్ధం ఆనవాళ్లు, ధర్మవరం, నన్నూరుపాడు, పేరాయిపాలెం, మణికేశ్వరం, ధేనువకొండ, అద్దంకి కొండ, తదితర ప్రాంతాల్లో పురాత ఆనవాళ్లు కోకొల్లలుగా దొరికినా భద్రపరచే ప్రదేశం లేక ఇప్పటికే కనుమరుగయ్యాయి. అద్దంకి రెవెన్యూ డివిజన్‌గా మారుతున్న తరుణంలో అద్దంకి పరిసర ప్రజలతోపాటు, చరిత్రను చదువుకునే విద్యార్థుల కోసం పురావస్తు మ్యూజీయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పురాతన ఆనావాళ్లు మెండుగా ఉన్న అద్దంకిలో ఒక పురావస్తు మ్యూజియం అవసరం ఎంతైనా ఉంది. భద్రపరచక ఇప్పటికే కొన్ని ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. మ్యూజియం ఏర్పాటు చేయకుంటే చరిత్ర పేజీల్లో మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, పురావస్తు అధికారులు ఆ దిశగా ఆలోచన చేసి మ్యూజియం ఏర్పాటు చేయాలి.
– జ్యోతి చంద్రమౌళి, చరిత్ర పరిశోధకుడు
పురావస్తు మ్యూజియం కలేనా?
పురావస్తు మ్యూజియం కలేనా?


