
యోగాపై అవగాహన పెంపునకు చర్యలు
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ
గుంటూరు వెస్ట్: యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ శంకరన్ హాలులో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన అధికారుల వీడియో సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడారు. వచ్చే నెల 21వ తేదీ వరకు జరుగనున్న యోగాంధ్ర క్యాంపెయిన్‌ను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతి మండల, డివిజనల్ స్థాయి కేంద్రాల్లోనూ యోగా మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రచారం విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి మండల, గ్రామ, డివిజనల్ స్థాయిలో ట్రైనర్ల ద్వారా యోగా సాధన వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. గ్రామ, మండలాల్లో వంద నుంచి 150 మంది యోగా చేసేందుకు వీలున్న విద్యాసంస్థలు, గోదాములు, గుర్తించాలని తెలిపారు. సచివాలయ కార్యదర్శుల ద్వారా యోగా సాధనకు పేర్లు నమోదు చేయించాలన్నారు. యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొక బృందాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి కల్చరల్ టీం ఈ బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.