
ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు దక్కినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి చెప్పారు. సాంబశివపేటలోని కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... 82 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కళాశాల నాక్ నుంచి తాజాగా నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు దక్కించుకున్నట్లు వివరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థినులకు ఆధునిక, సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. కాలానుగుణంగా ఉద్యోగం, ఉపాధి కల్పించే కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్వయంప్రతిపత్తి హోదా కలిగిన కళాశాల తాజాగా పొందిన నాక్ ఏ గ్రేడ్ గుర్తింపుతో మరో పదేళ్లపాటు స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళుతుందని చెప్పారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సులకు తీసిపోని విధంగా వాటికి సమాంతరంగా బీఎస్సీలో డేటాసైన్స్, ఏఐ, బయోకెమిస్ట్రీ వంటి ఆధునిక కోర్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో నాక్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి. మధుసూదనరావు, అధ్యాపకులు ఎం. సంతోషికుమారి, కె. అపర్ణ సీతారామ్, కె. సుబ్బరత్నమ్మ, జి.శేషు పాల్గొన్నారు.