
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మంత్రి అనగాని సత్యప్రసాద్
రేపల్లె: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లెలో బుధవారం జరిగిన నియోజకవర్గస్థాయి మహానాడులో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ టి. కృష్ణప్రసాద్ పాల్గొన్నారు
ఇబ్బంది లేకుండా రేషన్ పంపిణీ
వీడియో కాన్ఫరెన్సులో మంత్రి మనోహర్
తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరకుల పంపిణీ నిలిపివేతకు తీసుకున్న నిర్ణయం సున్నితమైనందున లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రేషను పంపిణీ నిర్వహించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బుధవారం సాయంత్రం తెనాలి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీ సంబంధిత చౌకధరల దుకాణాల వద్దే జరుగుతుందని చెప్పారు. అరవై అయిదేళ్లు పైబడిన కార్డుదారులు, అంగవైకల్యం కలిగిన లబ్ధిదారులకు మాత్రం ఇంటి వద్దే పంపిణీ చేస్తారని తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తుల దాఖలు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల కారణంగా కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
ముగ్గురికి గాయాలు
నాదెండ్ల: ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. గణపవరం పరిధిలో జాతీయ రహదారిపై భారత్‌గ్యాస్ గోడౌన్ వద్ద గణపవరం నుంచి ప్రయాణికులతో చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కారసాల సుబ్బారావు, నాగజ్యోతి, ఆటోడ్రైవర్ పల్లపు వెంకటేశ్వర్లు గాయాలపాలయ్యారు. నాగజ్యోతిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, మిగతా ఇద్దరిని చిలకలూరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.