
యోగా మన దేశ అపూర్వ సంపద
గుంటూరు వెస్ట్: వేల సంవత్సరాల క్రితం రుషుల కృషి ఫలితంగా యోగా అనే అపూర్వ సంపద మన దేశానికి దక్కిందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ పేర్కొన్నారు. యోగా మాసంలో భాగంగా బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాపై విస్తృత అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమాలు నెల రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. యోగాంధ్ర థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతను, ఉపయోగాలను వివరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా రంగోలి, ర్యాలీ, మారథాన్, పరుగు, విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. యోగా సాధన నిర్వహించనున్న ప్రాంతాల్లో ట్రైనర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

యోగా మన దేశ అపూర్వ సంపద