
నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేయాలి
ధర్నాలో రైతుల డిమాండ్
జె.పంగులూరు: నల్లబర్లీ పొగాకును మార్కెఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు, గిట్టుబాటు ధరకు రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం కొనాలని కౌలు రైతు సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పంగులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. పొగాకు కొనుగోలు చేయకపోతే తాము వ్యవసాయం చేయలేమని స్పష్టం చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు మాట్లాడుతూ నల్ల బర్లీ సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తక్షణమే రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా గానీ, కంపెనీల ద్వారా గానీ కొనుగోలు చేయాలన్నారు. కంపెనీల మోసం మాటలు నమ్మి రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారని, ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న పొగాకుకు డిమాండ్ ఉన్నప్పటికీ, కొనకుండా కాలయాపన చేస్తే రైతులు తక్కువ ధరకు ఇస్తారని కంపెనీలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ విషయం ప్రభుత్వం తీవ్రంగా తీసుకొని కంపెనీల ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. బర్లీ పొగాకు ద్వారా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రూ.70 వేల కోట్ల ఆదాయం వస్తుందని, అదే మాదిరిగా కంపెనీలకు కూడా వేల కోట్ల ఆదాయం వస్తోందని అన్నారు. అలాంటి పొగాకు పండించే రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. పొగాకు పంట కొనుగోలు చేసే వరకు రైతులు ఐక్యంగా పోరాడాలని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు మాట్లాడుతూ పొగాకు కంపెనీలు మాటలు నమ్మి రైతులు పూర్తిగా మోసపోయారని, మోసపు మాటలు చెప్పిన కంపెనీలు ఇప్పుడు ముఖ్యం చాటేశాయని, పొగాకు మొత్తం కొనుగోలు చేసేవరకు రైతులంతా నిలబడి పోరాడాలన్నారు. కార్యక్రమానికి ముందు జీపీఐ కంపెనీ ఏజెంటు దొంగచాటుగా వచ్చి రహస్యంగా రైతులు ఫొటోలు తీసి వారికి గేట్ పాస్‌లు ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించగా, రైతులు గమనించి ఏజెంట్ హర్షను పట్టుకొని నాయకుల ముందు ఉంచారు. అతని ద్వారా చిలకలూరిపేట కంపెనీ మేనేజర్ ప్రసాద్‌తో తహసీల్దార్ సింగారావు, నాగబోయిన రంగారావు, రామారావు ఫోన్లో మాట్లాడారు. రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు తక్షణమే కొనుగోలు చేయాలని, ఇంకొల్లు, పంగులూరు పరిసర ప్రాంతాల్లో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమానికి ముందు తహసీల్దార్ సింగారావు తడిచిన నల్లబర్లీ పొగాకు చూపించారు. అనంతరం తహసీల్దార్ సింగారావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు రాయిణి వినోద్‌బాబు, నాయకులు గుడిపూడి మల్లారెడ్డి, తలపనేని సుబ్బారావు, పోతుగంటి ఆదుసాహెబ్, నాయపాము ప్రభాకర్, అద్దంకి సుబ్బారావు, మద్దినేని సుబ్బరామయ్య, నాయపాము జాన్, ఉన్నం అంజయ్య, మాగులూరి చంద్రశేఖర్, వీరాంజనేయులు, గొర్రె వేణుబాబు, గోగుమళ్ల సింగయ్య, బాచిన శేషగిరి పాల్గొన్నారు.