
తుఫాన్ షెల్టర్లను సిద్ధంగా ఉంచాలి
ఎంపీడీవో శ్రీనివాసరావు
కర్లపాలెం: తుఫాన్ ప్రమాదం పొంచి ఉన్నందున తీరప్రాంత గ్రామాలలో ఉన్న షెల్టర్లను ప్రజలు ఉండేందుకు అనుకూలంగా సిద్ధం చేయాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. కర్లపాలెం మండల పరిధిలోని సముద్రతీర గ్రామాలైన పేరలి, కట్టావాద, తుమ్మలపల్లి, పెదగొల్లపాలెం గ్రామాలలో ఉన్న తుఫాన్ షెల్టర్‌లను మంగళవారం ఎంపీడీవో శ్రీనివాసరావు స్థానిక గ్రామ సచివాలయ సిబ్బందితో కలసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో గిరిజనులు, పూరి గృహాలలో ఉండే వారు తలదాచుకునేందుకు తుఫాన్ షెల్టర్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. అనంతరం తుమ్మలపల్లి, పెదగొల్లపాలెం గ్రామ సచివాలయాలను ఎంపీడీవో సందర్శించి రికార్డులు పరిశీలించారు.