
ప్రాణం తీసిన ఇనుప గేటు
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
యద్దనపూడి: నిండు ప్రాణాన్ని ఇనుప గేటు బలితీసుకుంది. విద్యుత్‌షాక్ కొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన యద్దనపూడి మండలంలోని యనమదల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రత్నకుమారి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యద్దనపూడి పంచాయతీలోని కటారివారిపాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి సుబ్బాయమ్మ (60) గత 8 సంవత్సరాలుగా యనమదల గ్రామంలో రైస్‌మిల్లును లీజుకు తీసుకొని అక్కడే ఉంటోంది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సుబ్బాయమ్మ మిల్లు నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఇనప గేటును పట్టుకుంది. ఆ గేటు పైన ఎలుకలు విద్యుత్‌వైర్లను కొరకటంతో ఆ గేటుకు విద్యుత్ సరఫరా జరిగి సుబ్బాయమ్మ పడిపోయింది. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపి 108కు సమాచారం అందించారు. సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై రత్నకుమారి సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.