
నిర్ణీత గడువులోపు అర్జీలు పరిష్కరించాలి
బాపట్ల: అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు వారి సమస్యలను స్వేచ్ఛగా ఎస్పీకి విన్నవించుకున్నారు. కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, ఇతర సమస్యలపై వచ్చిన 50 అర్జీలను ఎస్పీ పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి అర్జీలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కరానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని తెలిపారు. పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని పోలీస్ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్‌ఐ శ్రీనివాస్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ తుషార్ డూడీ