
ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు
చీరాల అర్బన్: తినుబండారాలు ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మితే చర్యలు తప్పవని చీరాల తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు హెచ్చరించారు. ప్రపంచ తూనికలు, కొలతలు దినోత్సవం ఈనెల 20న నిర్వహిస్తున్నామని చెప్పారు. అలానే తూనికలు, కొలతల విభాగం 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా సోమవారం చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లోని స్టాల్స్‌ను పరిశీలించారు. స్టాల్స్ నిర్వహించేవారు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు అమ్మే ప్రతి వస్తువును నిర్దేశించిన ధరలకు మాత్రమే అమ్మాలన్నారు. అలానే వస్తువు కొనుగోలు చేసే ముందు తూకం, ధరలు సరిచూసుకొని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.