
నేడు మహా కుంభాభిషేకం
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి నూతన రాతి దేవస్థానంలో మహా కుంభాభిషేకాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు శృంగేరీ పీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి నిర్వహించనున్నారు.
వైభవంగా కలశ యాత్ర
మహా కుంభాభిషేకంలో భాగంగా దేశంలోని పవిత్ర నదుల నుంచి సేకరించి తెచ్చిన పవిత్ర జలాలకు తోడుగా అద్దంకిలో జీవ నది అయిన గుండ్లకమ్మ నుంచి సోమవారం ఉదయం ఐదు గంటలకు 1008 కలశాలలో 1008 మంది పుణ్య సీ్త్రలు జలాలను సేకరిస్తారు. నది పరీవాహక ప్రదేశం నుంచి శింగరకొండ క్షేత్రం వరకు ఆరు కిలోమీటర్ల పాదయాత్రతో కలశ యాత్ర నిర్వహిస్తారు. దీనిలో ప్రధాన ఆకర్షణగా కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన గజేంద్రుడు (ఏనుగు). ఈ కలశయాత్రలో పాల్గొనేందుకు అద్దంకి, పరిసర గ్రామాల సీ్త్రలు భారీగా తరలి రానున్నారు.
విశేష పూజలు
ఉదయం 8 గంటల నుంచి గురు వందనం, గణపతి పూజ, మండప పూజలు, వేదపారాయణం, సుందరాకాండ పారాయణం, శాంతి హవనములు, పూర్ణాహుతి, జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీస్వామితో యాగశాలలో హోమాలు, విమాన శిఖ కుంభాభిషేకం, యంత్ర స్తాపన, జీవధ్వజ ప్రతిష్ట, అనుగ్రహభాషణం, రక్ష కంకణాధారణ, మూల విరాట్‌కు 70 మంది రుత్వికులతో, పంచామృతాలతో అభిషేకంతో పాటు స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించనున్నారు.
పలువురు మంత్రులు రాక
అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వామికి పట్టు వస్త్ర సమర్పణ చేయనున్నారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, గృహని ర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొనున్నారు.
భారీగా ఏర్పాట్లు
మహా కుంభాభిషేకం కార్యక్రమానికి దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ యం. తిమ్మనాయుడు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎండలకు భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కుంభాభిషేకాన్ని భక్తులు చూసేందుకు భారీ స్కీన్‌లను ఏర్పాటు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అన్నదానానికి ప్రత్యేక స్టాల్‌లు ఏర్పాటు చేశారు. అన్ని సామాజిక సత్రాల్లో కూడా అన్నవితరణ చేపడతారు. కార్యక్రమ నిర్వహణకు 700 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు.
శృంగేరీ పీఠ ఉత్తరాధికారి విదుశేఖర భారతీస్వామి రాక 50 వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా
శృంగేరి పీఠాధిపతికి ఘన స్వాగతం
కుంభాభిషేకంలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతీ స్వామి శింగరకొండ విచ్చేశారు. అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. భక్తులకు స్వామి ఆశీర్వాదాలు అందజేశారు.

నేడు మహా కుంభాభిషేకం

నేడు మహా కుంభాభిషేకం

నేడు మహా కుంభాభిషేకం