
వైఎస్సార్ సీపీదే విజయం
● వైస్ ఎంపీపీగా దొంతిరెడ్డి సింధు ఏకగ్రీవం ● అభినందనలు తెలిపిన వైఎస్సార్ సీపీ నాయకులు
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): పిట్టలవానిపాలెం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి, భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు.
మండలంలో మొత్తం 11మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో 10మంది వైఎస్సార్ సీపీ సభ్యులు ఉన్నారు. ఒకరు టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు ఉన్నాడు. గతంలో వైస్ ఎంపీపీగా పనిచేసిన పిట్టువారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు దెందుకూరి సీతారామరాజు మార్చినెలలో జరిగిన ఎన్నికలో ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారి, డ్వామా పీడీ ఎ.విజయలక్ష్మి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. సోమవారం ఉదయం 10.45 గంటలకు వైఎస్సార్ సీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. చందోలు–1 ఎంపీటీసీ సభ్యుడు షేక్ బాజీ భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు పేరును వైస్ ఎంపీపీ పదవికి ప్రతిపాదించారు. అల్లూరు ఎంపీటీసీ సభ్యురాలు వాలి కుమారి బలపరిచారు. ఎన్నిక నిర్ణీత సమయానికి వైస్ ఎంపీపీ పదవికి దొంతిరెడ్డి సింధు ఒక్కరే పోటీలో ఉండటంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి విజయలక్ష్మి ప్రకటించారు. అనంతరం ఎన్నికల అధికారి విజయలక్ష్మి దొంతిరెడ్డి సింధుకు ధృవీకరణ పత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. వైస్ ఎంపీపీగా ఎన్నికై న సింధుకి ఎన్నికల అఽధికారి విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. చందోలు ఎస్‌ఐ మర్రి వెంకట శివకుమార్ యాదవ్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో తహసీల్దార్ డి.వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్ ఎంపీడీవో ఎలీషాబాబు, సూపరిటెండెంట్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
మండలంలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తూ, వైఎస్సార్ సీపీ బలోపేతానికి పనిచేస్తానని వైస్ ఎంపీపీ సింధు చెప్పారు. వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో తనకు ఉపాధ్యక్ష పదవి లభించినట్లు తెలిపారు. తనను ఎన్నుకున్న ఎంపీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
అభినందనలు
వైస్ ఎంపీపీగా ఎన్నికై న డి.సింధును ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు, వైస్ ఎంపీపీ చేబ్రోలు కృపానందం, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు వాలి శివారెడ్డి, మండే విజయ్‌కుమార్, కుంటం ప్రసన్నరాజు, దోమా వెంకటేశ్వరరెడ్డి, దొంతిరెడ్డి కోటిరెడ్డి, తిరుమలరెడ్డి, బడుగు మాధవి, ఆరేపల్లి శివయ్య అభినందించారు.