
రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభం
క్రోసూరు: స్థానిక జెడ్పీ పాఠశాల ఆవరణలో వైఎంసీఏ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను కంచేటి సాయిబాబు ఆదివారం ప్రారంభించారు. మొత్తం 40 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు అఖిల్ తెలిపారు. సాయిబాబు మాట్లాడుతూ క్రీడల వల్ల యువతకు ఆరోగ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. పోటీలలో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.50,116, ద్వితీయ బహుమతిగా రూ.25,116, మూడో బహుమతిగా రూ.10,116, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు రూ.5,116 అందించనున్నట్లు వెల్లడించారు. బెస్ట్ బ్యాట్స్‌మన్‌కు రూ.2,116, బెస్ట్ బౌలర్‌కు రూ.2,116 అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దిగుమర్తి అప్పారావు, మన్నెం శ్రీను, వెంకటరామిరెడ్డి, బండారు రాము, కంభంపాటి రాము, బాబు పాల్గొన్నారు.
మద్యం మత్తులో డ్రైవింగ్
తాడేపల్లి రూరల్: ఫూటుగా మద్యం తాగి కారును విచక్షణారహితంగా నడపడంతో వృద్ధుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి రోడ్డులో పెనుమాక–ఉండవల్లి మధ్య ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నరేష్ అనే వ్యక్తి బొలేరో వాహనంలో పెనుమాక నుంచి ఉండవల్లి వెళుతున్నాడు. ఈక్రమంలో ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక వెళ్తున్న బ్రహ్మయ్య (60) ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బ్రహ్మయ్యతో పాటు వాహనంపై ఉన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వీరి వెనుక ఉన్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో అతనికీ గాయాలయ్యాయి. బొలెరో వాహనం రెండు వాహనాలను ఢీకొట్టడంతో వాటిపై ప్రయాణిస్తున్న ముగ్గురు గాలిలోకి ఎగిరి రోడ్డు మీద పడ్డారు. అనంతరం బొలెరో వాహనం రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్యతో పాటు గాయపడ్డ ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బ్రహ్మయ్య మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మద్యం మత్తులో వున్న నరేష్‌ను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభం