
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత
బాపట్ల: భావితరాల ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లు, కార్యాలయాలలో ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని చెత్త, వ్యర్థాలను తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. గునపాలు, పారలు, చీపురులు చేతబట్టి పిచ్చి మొక్కలు తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నామన్నారు. స్వచ్ఛత అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదని, అది మన అభివృద్ధికి పునాదని, శుభ్రమైన పరిసరాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయన్నారు. పోలీస్ స్టేషన్, కార్యాలయాల పరిసరాలు శుభ్రంగా ఉండాలన్నారు.
పక్షుల కోసం నీటి పాత్రలు ఏర్పాటు చేయాలి
పరిశుభ్రమైన పర్యావరణం మానసిక ప్రశాంతతను పెంచుతుందన్నారు. ఇది పోలీస్ సిబ్బంది పనితీరుపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుతం వేసవి కాలం కనుక సహజమైన చల్లదనం కోసం టెరరస్ లపై ఆకర్షణీయమైన, ఆరోగ్యకరమైన మొక్కలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పక్షుల దాహార్తి తీర్చేందుకు గోడలు, టెరరస్ లపై చిన్న మట్టి పాత్రలలో నీటిని ఏర్పాటు చేయాలన్నారు. భూమిపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మనం ఇప్పుడు నాటే మొక్కలు భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం సామాజిక బాధ్యతగా భావించి అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, ఎఆర్ డీఎస్పీ పి.విజయసారది, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ నారాయణ, ఆర్‌ఐ మౌలుద్దీన్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ
జిల్లా పోలీసు కార్యాలయంలో
‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’