
కార్మికులకు మెరుగైన వసతులు కల్పించండి
తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి ఆయా గుత్తేదారు సంస్థలను ఆదేశించారు. రాజధాని నిర్మాణాలలో పనిచేసేంందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు గుత్తేదారు సంస్థలు కల్పిస్తున్న సదుపాయాలను ఆమె గురువారం క్యాంపులకు వెళ్లి తనిఖీ చేశారు. మొదట తుళ్లూరులోని ఆర్‌వీఆర్ సంస్థ క్యాంపును పరిశీలించారు. ఎండ అధికంంగా ఉండటంతో అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. కార్మికులకు భోజన వసతిపై ఆరా తీశారు. కార్మికుల కుటుంబ సభ్యులు వచ్చినపుడు నివసించేందుకు ప్రత్యేక వసతి కల్పించాలని, వారి పిల్లలు చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఐనవోలు, శాఖమూరులోని ఎన్‌సీసీ, ఆర్‌వీఆర్ సంస్థల క్యాంపులు పరిశీలించారు.