
మహాకుంభాభిషేక పూజలు ప్రారంభం
అద్దంకి: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి నూతన విమాన శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో నిర్వహించతలపెట్టిన మహాకుంభాభిషేక కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. దానిలో భాగంగా స్వామివారికి కలశం సమర్పించిన నలమలపు విజయభాస్కరరెడ్డి దంపతులు కలశ అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ తిమ్మనాయుడు, సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భరత నాట్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం
తెనాలి: స్థానిక శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ఉదయం 11 గంటలకు స్వామి వారిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు అంకురారోపణ, ధ్వజారోహణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవాన్ని జరిపారు. ఆలయ సహాయ కమిషనర్/కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుమలగిరి హుండీ ఆదాయం రూ. 26.41 లక్షలు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): గ్రామంలో వేంచేసియున్న వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.26,41,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. ప్రాంగణంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత నెలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ పవన్‌కల్యా, పరిటాల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. లెక్కింపు సమాచారాన్ని ఆలయ పాలకవర్గానికి ఇవ్వలేదని లెక్కింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన కల్యాణ మహోత్సవాల్లో ఈవో ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి గ్రామస్తులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో ఆలయ ఈవో కార్యాలయంలో లేరు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వెంకటపాలెం
యూపీ పాఠశాలలో చోరీ
తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెం యూపీ స్కూల్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్‌ఎం జానకీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఇటీవల ప్రధానమంత్రి రాక నేపధ్యంలో వసతి కోసం పోలీసులకు పాఠశాలను ఇచ్చామని, కార్యక్రమం అనంతరం ఆఫీసు గదిలో ఉన్న రూ.20 వేల పెద్ద సౌండ్ బార్, రూ.3 వేల చిన్న సౌండ్ బాక్స్ చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

మహాకుంభాభిషేక పూజలు ప్రారంభం