
చిన్నారి మేధావి ప్రదీప్ నారాయణకు అరుదైన గుర్తింపు
తెనాలి: రూరల్ మండలం గుడివాడకు చెందిన చిన్నారి మేధావి బండికళ్ల ప్రదీప్‌నారాయణకు మరో గౌరవం దక్కింది. ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ వరల్డ్‌వైడ్ ఫౌండేషన్ ‘ఇంటర్నేషనల్ బెస్ట్ అచీవర్ అవార్డు’ లభించింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ఎంఎస్‌ఎంఈ, నీతి అయోగ్‌ల సహకారంతో ఫౌండేషన్ ఇటీవల విశాఖపట్నంలోని ప్రెస్‌క్లబ్‌లో ఇంటర్నేషనల్ సోషల్ అవార్డ్స్ ప్రదానోత్సవం నిర్వహించింది. ఇందులో ప్రదీప్‌నారాయణకు ఈ గౌరవాన్ని అందజేశారు. ప్రస్తుతం నాలుగేళ్ల వయసున్న చిన్నానరి 23 నెలల వయసు నుంచే అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్నాడు. తొలుత 150 పైగా వస్తువులు, కూరగాయలు, పక్షుల పేర్లను చెప్పాడు. ప్రస్తుతం 500 పైగా జంతువులు, వాహనాలు, జెండాలు, ఆకారాలు, రంగులు, ఫలాలు, కూరగాయలు, శరీర భాగాలు, ఆట బొమ్మలు, వస్త్రధారణ వంటి విభిన్న అంశాలను గుర్తించి చెప్పగలిగిన ప్రతిభను సొంతం చేసుకున్నాడు. భారత జాతీయ గీతాన్ని కేవలం 52 సెకన్లలోనే శ్రద్ధగా పాడుతున్నాడు.