
చీరాల చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం
చీరాల: చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై కూటమి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌లు హాజరయ్యారు. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా చీరాల ఆర్డీఓ టి.చంద్రశేఖర్ నాయుడు వ్యవహరించారు.
నాలుగు సంవత్సరాలపాటు చైర్మన్‌గా పనిచేసిన చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు టీడీపీ మద్దతు కౌన్సిలర్లతోపాటు ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్లు మొత్తం 22 మంది సంతకాలు చేసిన వినతిపత్రాన్ని గత నెల 23న జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళికి 17 మంది కౌన్సిలర్లు అందించారు. వారితో కూడా కలిపి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్యా బలం 24 ఉండడంతో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించేందుకు ఈ నెల 14వ తేదీని కలెక్టర్ ఖరారు చేసిన విషయం విదితమే.
చైర్మన్ పదవికి రాజీనామా..
బుధవారం ఉదయం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆర్డీవోకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఉదయం 10 గంటలకు అధికారులు అవిశ్వాస తీర్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తీర్మానానికి 24 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి 26 మంది పాల్గొని మూజువాణి పద్ధతిలో అనుకూలంగా ఓటు వేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన తర్వాత మరో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కూటమికి మద్దతుగా నిలిచారు. అనంతరం 12.30 గంటలకు వైస్‌చైర్మన్–1పై అవిశ్వాస తీర్మానానికి 24 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి 26 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లు వేశారు.
మద్దతుగా 26 మంది కౌన్సిలర్ల తీర్మానం వైస్ చైర్మన్‌పైనా నెగ్గిన అవిశ్వాసం ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీలు హాజరు
తేదీ ఖరారు తర్వాత ఆపలేం...
మీడియాకు అనుమతి నిరాకరణ
అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. దీంతో కార్యాలయం ఎదుట రోడ్డుపైనే ఎండలోనే మీడియా ప్రతినిధులు ఉండిపోయారు. గదిని కేటాయించాలని కోరినా అనుమతులు లేవంటూ లోనికి రానివ్వలేదు. రెండు గంటలపాటు రోడ్డుపైనే వేచి ఉన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత అధికారులు లోపలికి పిలవడంతో, బయటనే ఉంటామని జర్నలిస్టులు చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీలు బయటకు వచ్చి అవిశ్వాస తీర్మాన విషయాలను మీడియాకు వివరించారు. ఎన్నడూ లేని విధంగా కార్యాలయంలోనికి కూడా అనుమతించకపోవడం ఏంటని ఎమ్మెల్యే, ఎంపీల ఎదుట జర్నలిస్టులు వాపోయారు.
అనంతరం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎంపీ టి.కృష్ణప్రసాద్‌లు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అవిశ్వాస తీర్మానం నిర్వహించేందుకు తేదీ ఖరారు అయిన తర్వాత చైర్మన్ వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి చేరారన్నారు. అయితే పార్టీలోకి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అవిశ్వాసం తీర్మానం రోజున చైర్మన్ పదవికి రాజీనామా చేయడం సరికాదన్నారు. ముందే రాజీనామా చేస్తే అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఉండేదే కాదన్నారు. అవిశ్వాసానికి తేదీ ఖరారు చేసిన తర్వాత ఆ ప్రక్రియను ఆపడం జరగదని, అలానే కూటమి కౌన్సిలర్లు అభిప్రాయానికి తమ మద్దతు పలికామన్నారు. చైర్మన్‌గా ఉన్న ఆయన హయాంలో వార్డులలో అభివృద్ధి కుంటుపడిందని కౌన్సిలర్లు చెబుతున్నారన్నారు. భవిష్యత్‌లో కూటమి కౌన్సిలర్ల సహకారంతో చీరాల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకారం అందిస్తామన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ అవిశ్వాస తీర్మాన కార్యక్రమాన్ని నియమనిబంధనల మేరకు నిర్వహించామన్నారు. వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను త్వరలో నిర్వహిస్తామన్నారు. అవిశ్వాసం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

చీరాల చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం