
ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం
బాపట్ల: ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి పిలుపునిచ్చారు. రైతాంగం, కార్మికులపై భారం వేస్తూ దోపీడీ శక్తుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రమైన బాపట్లలో పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రమాదేవి మాట్లాడారు. జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు టి.కష్ణమోహన్ అధ్యక్షత వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యమాల ద్వారా ప్రజల పక్షాన పోరాటం చేయొచ్చు అన్నారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాబురావు మాట్లాడుతూ.. దేశంలో కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలతో ప్రజలపై భారం పడుతోందన్నారు. కులాల మధ్య చిచ్చు రేపుతున్నారన్నారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో నల్లబర్లీ పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ మజుందార్, ఎన్.బాబురావు, సీహెచ్ మణిలాల్, ఎం.కొండయ్య, వి. వెంకట్రామయ్య, బి.తిరుమల, టి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సామర్థ్యానికి మించి ఇసుక రవాణా
తెనాలి: ఇసుక తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఇసుక రవాణాలోనూ ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. భారీ వాహనాల్లో కెపాసిటీకి మించి రవాణా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. భారత్ బెంజ్, టాటా బెంజ్ వంటి భారీ వాహనాల్లో ఇప్పుడు ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతోందని తెలిసిందే. వీటి కెపాసిటీ 17–18 టన్నులు మాత్రమే. ఇందుకు భిన్నంగా ఒక్కో వాహనంలో రూ.40 టన్నులు, అంతకుమించిన పరిమాణంలోనూ రవాణా చేస్తున్నారు. వాహనం బాడీకీ పైన దాదాపు మీటరు ఎత్తులో లోడింగ్ చేస్తున్నారు. పైన పట్టా కప్పి మరీ గమ్యస్థానానికి రవాణా చేస్తున్నారు.
వాహనదారులకు అవస్థలు
ప్రతిరోజూ పరిమితికి మించిన లోడింగ్‌తో ఇసుక రవాణా వాహనాలు తెనాలి మీదుగా వెళుతున్నాయి. ఇసుక జారిపోతున్నా, వెనుక వచ్చే ద్విచక్రవాహన దారులకు ఇబ్బందిగా ఉంటున్నా ఎవరికీ పట్టటం లేదు. కొద్దిరోజుల కిందట వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని రైల్వే లోబ్రిడ్జి వద్ద వాహనాల నుంచి ఇసుక జారిపోయి ప్రజలు ఇబ్బది పడ్డారు. కెపాసిటీ మించిన పరిమాణంతో ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాలతో రోడ్లు, కల్వర్టులు దెబ్బతింటున్నాయి. తెనాలి పట్టణంలోంచి వాహనాలు ప్రతిరోజూ పట్టపగలే వెళుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు.