
ప్రజల ఆందోళన
యంత్రాలతో ఇసుక తవ్వకాలపై
కొల్లూరు: కృష్ణా నదిలో చేపడుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రజలు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడటంపై పత్రికల్లో వెలువడుతున్న కథనాలకు తోడు, గాజుల్లంకకు చెందిన వ్యక్తులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడంతో మంగళవారం రాత్రి రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, డీఎస్పీ ఎ. శ్రీనివాసరావులు గాజుల్లంక వద్ద ఇసుక క్వారీలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లకుండానే అధికారులు బాపట్ల–కృష్ణా జిల్లాల నడుమ రాకపోకలకు ఏర్పాటు చేసిన బాటలో ఆగి లారీలను నిలువరించి ప్రశ్నిస్తున్న సమయంలో ప్రజలు అధికారులను చుట్టుముట్టి తమ గోడు వినిపించారు. తమ పట్టా భూముల్లో సైతం తవ్వుకొని తరలిస్తున్నారని ఆర్డీవో ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. భారీ యంత్రాలతో గ్రామం వెంబడి తవ్వకాలు జరుపుతుండటం, నిర్దేశించిన పరిమాణాలను మించి ఇసుక తవ్వుకొని తరలిస్తుండటం కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, సముద్రపు నీరు చొచ్చుకొని వస్తున్నాయని అన్నారు. పశువులు తాగేందుకు సైతం చుక్క నీరు లేకుండా పోయిందని వాపోయారు. ఇసుక తవ్వకాలు చేపడుతున్న ప్రాంతం మైనింగ్ శాఖ నిర్దేశించిన ప్రదేశంలో జరగడం లేదని, కనీసం హద్దులు సైతం ఏర్పాటు చేయలేదని మైనింగ్ శాఖాధికారులను స్థానికులు ప్రశ్నించారు. దీనిపై మైనింగ్ శాఖాధికారులు తాము హద్దులు నిర్ణయించామని, తమ సిబ్బందిని నియమించామని ఎల్లప్పుడూ తాము ఇక్కడ ఉండలేమని బాధ్యతారాహిత్య సమాధానం చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతుంటే చర్యలు తీసుకోకుండా ఇటువంటి సమాధానాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించడంతో, ఇకపై గాజుల్లంకలో ఉచిత ఇసుక క్వారీ నిర్వహణ జరగదని, కేవలం డంపింగ్‌కు మాత్రమే తవ్వకాలు జరుగుతాయని మైనింగ్ శాఖాధికారులు దాటవేత సమాధానంతో సరిపెట్టారు. నదిలో యంత్రాలున్నాయని స్థానికులు ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణం యంత్రాలను సీజ్ చేయాలని ఆమె అధికారులను ఆదేశించిచారు. కార్యక్రమంలో వేమూరు సీఐ పీవీ.ఆంజనేయులు, వేమూరు ఎస్‌ఐ రవికృష్ణ, కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గాజుల్లంక ఇసుక క్వారీ వద్ద ఆర్డీఓ పరిశీలన మైనింగ్ అధికారుల తీరుపై ఆవేదన