
లే అవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: లే అవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో బాపట్ల మున్సిపాలిటీ, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లే అవుట్‌లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. 2019 నుంచి బాపట్ల మున్సిపాలిటీ, బావుడా పరిధిలోని తొమ్మిది మండలాలలో మొత్తం 183 అనధికార లే అవుట్లను గుర్తించి వాటి వివరాలను డీటీసీపీకి పంపినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అందులో 86 లే అవుట్లను 22–ఎ కింద గుర్తించి రిజిస్ట్రేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలియజేశామని, మిగిలిన 97 లే అవుట్లను సబ్ డివిజన్‌లుగా చేసి పంపాలని వాటిని తిప్పి పంపారని వారు కలెక్టర్‌కు వివరించారు. 97 లే అవుట్లకు సంబంధించి సర్వే నెంబర్లు వారీగా ఆయా తహసీల్దార్లతో సబ్ డివిజన్ చేయించి వాటి వివరాలను బావుడాకు తెలియజేయాలని రెవెన్యూ డివిజన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆ వివరాలను డీటీసీపీకి పంపి రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త లేఅవుట్ల అనుమతులకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. మున్సిపాలిటీలలో, పంచాయతీలలో గృహ నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి ప్రభుత్వం సూచించిన నియమాలను బావుడా అధికారి వివరించారు. ఎవరైనా గృహాలు నిర్మించుకోవాలనుకునేవారు వారి దరఖాస్తులను పంచాయతీరాజ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా మాత్రమే చేసుకోవాలన్నారు. సమావేశంలో డీపీఓ ప్రభాకర్, బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, బాపట్ల, రేపల్లె, అద్దంకి, చీరాల మున్సిపల్ కమిషనర్లు, బావుడా ప్లానింగ్ అధికారి షేక్ ఖలీషా, లైసెనన్స్ టెక్నికల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి
మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మోటుపల్లి గ్రామం, మ్యూజియం నిర్మాణం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. కాకతీయులనాటి అభయ శాసనాలను తెలుగులోకి అనువదిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రాచీన వైభవం తెచ్చేలా ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. కోదండరామ దేవాలయానికి సమీపంలోని 5.8 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. కాకతీయులు, చోళుల నాటి శాసనాలు, పంచలోహాలను చిన్నగంజాంలోనే భద్రపరచడానికి మ్యూజియం నిర్మించాల్సి ఉందని తెలిపారు. మ్యూజియం నిర్మాణంపై పురావస్తు శాఖకు సమగ్ర నివేదికతతోపాటు లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాచీన సంపద ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియం, చైన్నె మ్యూజియం, విజయవాడ మ్యూజియంలో ఉందన్నారు. వాటిని తెప్పించడానికి దస్త్రాలను సిద్ధం చేయాలన్నారు. వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధితో మోటుపల్లి మరింత ప్రాచుర్యం పొందనుందన్నారు. సమావేశంలో చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సూర్యప్రకాశరావు, చిన్నగంజాం తహసీల్దార్ ప్రభాకర్‌రావు, మోటుపల్లి అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.