
తెలుగు సాహితీ సంబరాల్లో తెనాలి కవులు
తెనాలి: ఏలూరులో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీల్లో 48 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి జాతీయ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. తెనాలికి చెందిన కవి, రచయిత డాక్టర్ రంగిశెట్టి రమేష్‌కు కవిరత్న సాహితీ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ప్రముఖ సాహితీవేత్తలు, కళాకారుల సమక్షంలో సంస్థ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కార్యదర్శి ఈశ్వరి భూషణం, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఈ అవార్డును అందజేశారు.
ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు భాషా
సేవా సాహితీ పురస్కారం...
ఇదే వేదికపై తెనాలికి చెందిన కవి, రచయిత, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగుభాషా సేవా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వృత్తిపరంగా గుంటూరు–2 ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆళ్ల నాగేశ్వరరావు, ప్రవృత్తిగా సాహితీ సేద్యం చేస్తున్నారు. వచన కవితా ప్రక్రియలో ఇప్పటికీ రోజుకో సామాజిక అంశంతో కవితను రాస్తున్నారు.
డాక్టర్ ప్రజ్ఞాచారికి తెలుగు భాషా సేవా పురస్కారం
తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీ రత్న డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారికి తెలుగు భాషా సేవా జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. చైతన్యవంతమైన భావ జాలంతో రచనలు చేస్తూ, తెలుగు భాష అభ్యున్నతికి తనదైన శైలిలో కృషి చేస్తున్నందుకు, ఆయన సాహితీ సేవలను గుర్తించి జాతీయ తెలుగు భాషా సేవా పురస్కారాన్ని ప్రదానం చేశామని నిర్వాహకులు వెల్లడించారు.