
భావన్నారాయణస్వామి ఆశీస్సులతో దేశం సుభిక్షం
బాపట్ల: శ్రీ భావన్నారాయణ స్వామి ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం స్వామివారి రథోత్సవాన్ని కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాపట్ల భావపురి కాలనీలో కొలువైన శ్రీ మత్యుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ క్షీరభావన్నారాయణ స్వామి 1432వ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నాయని తెలిపారు. రూ.1.50కోట్లతో నూతన రథాన్ని తయారు చేయించామన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవం అనంతరం నూతన దివ్య రథంలో నగరోత్సవం నిర్వహించడం శుభపరిణామన్నారు. స్వామి వారి ఆశీస్సులతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. స్వామివారి దివ్య రథ నగర ఉత్సవంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం కొండయ్య, గుడి వంశ పారంపర్య ధర్మకర్త రమణబాబు, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి