
నీటి కుంటలో పడి బాలుడు మృతి
చిమ్మిరి బండ ఎస్సీ కాలనీలో విషాదం
మార్టూరు: ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చిమ్మిరిబండ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన దుడ్డు తిమోతి కుమారుడు కార్తీక్ (8) ఆదివారం సాయంత్రం తన తాతతో కలిసి గేదెలను మేపడం కోసం పొలం వెళ్లాడు. ఈ క్రమంలో గేదెలు కొండను ఆనుకొని ఉన్న కుంటలో నీరు తాగడానికి దిగాయి. గేదెలను కుంటలో నుంచి వెలుపలికి తోలడం కోసం కుంటలోకి ఒంటరిగా దిగిన కార్తీక్ అలాగే నీటిలో మునిగిపోయాడు. కొంతసేపటికి స్థానికులు నీటి కుంటలో దిగిన కార్తీక్ కోసం గాలించగా అప్పటికే మృతి చెందిన బాలుడు శవమై తేలాడు. ఆడుతూ పాడుతూ తమ ముందు చలాకీగా తిరిగే చిన్నారి శవమై ఇంటికి రావడంతో కుటుంబంతోపాటు ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.