
నల్ల బర్లీ పొగాకు రైతులను ఆదుకోవాలి
బాపట్ల జిల్లా రైతు సంఘం డిమాండ్
జె.పంగులూరు: జిల్లాలో నల్లబర్లీ పొగాకును తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతుల్ని ఆదుకోవాలని బాపట్ల జిల్లా రైతు సంఘం కార్యదర్శి తలపనేని రామారావు, సీనియర్ నాయకులు కందిమళ్ల రామకోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం పంగులూరులో విలేకర్లతో మాట్లాడారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘాల పోరాటాల ఫలితంగా గత నెల 29న గుంటూరులోని లాం యూనివర్సిటీలో పొగాకు కంపెనీల యజమానులు, రైతు సంఘాల నాయకులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సమావేశం అయ్యారని తెలిపారు. ఇందులో మంత్రి అందరితో చర్చించి గత నెల 30వ తేదీ నుంచి పొగాకు కొనుగోలు చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. కొనుగోలును పరిశీలించేందుకు నలుగురు అధికారులను నియమించడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఇది జరిగి 12 రోజులు అవుతున్నా ఎక్కడా విధి విధానాలు అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. కంపెనీ ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి గ్రేడ్ చేయించి, మంచి పొగాకు మాత్రమే తీసుకెళుతున్నారని ఆరోపించారు. సరుకు బాగుంటేనే గేటు పాస్‌లు ఇస్తున్నారని, ఇలాగైతే తాము పొగాకు అమ్ముకోలేమని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
రైతుల ఆత్మహత్యలు
ఈ నెల 6న పర్చూరు మండలం వీరన్నపాలేనికి చెందిన కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడని రైతు సంఘం నేతలు తెలిపారు. 9న ఇంకొల్లు మండలం దుద్దుకూరు చెందిన మరో కౌలు రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు ఆదుకోవడం పోయి మీనమేషాలు లెక్కపెడుతోందని విమర్శించారు. ఈ సంవత్సరం నల్లబర్లీ పొగాకు 75 మిలియన్ కేజీల దిగుబడి వచ్చిందనే విషయం అటు కంపెనీలకు, ప్రభుత్వానికీ తెలుసన్నారు. కానీ 55 మిలియన్ కేజీల పొగాకు ఎగుమతులకు మాత్రమే ఆర్డర్లు వచ్చాయని కంపెనీ యజమానులు చెబుతున్నారని వివరించారు. మిగిలిన 20 మిలియన్ కిలోల పొగాకును ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా, పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని, ఇందుకోసం రూ. 300 కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా నల్లబర్లి పొగాకు కొంటామని కంపెనీలు చెప్పడంతో రైతులు అత్యధిక సంఖ్యలో సాగు చేశారని వివరించారు. కంపెనీ మాటలు నమ్మిన కౌలు రైతులు లక్షలాది రుపాయలు అప్పులు తెచ్చి, పెట్టుబడులు పెట్టి సాగు చేశారని వివరించారు. అయితే, తెల్లబర్లీ పొగాకు కొంత కొనుగోలు చేశారని, నల్లబర్లీ పొగాకును మాత్రం ఇంత వరకు కొనుగోలు చేయలేదని రామారావు, రామకోటేశ్వరరావు తెలిపారు.