గుంటూరు లీగల్: ప్రతి బిడ్డా ఆరోగ్యంగా జన్మించాలని, ప్రసవ సమయంలో తల్లీబిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఒక బలమైన పునాదిని నిర్మించడమే ముఖ్యోద్దేశమని అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు సోమవారం గుంటూరు జీజీహెచ్‌లోని నర్సింగ్ విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బంది, పిల్లల వైద్యశాఖ, ప్రసూతి వైద్య శాఖలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
సదస్సులో జియావుద్దీన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తల్లులు, నవజాత శిశువుల మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు మూడు లక్షల మంది మహిళలు ప్రసవం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. ఈ సంఖ్యను తగ్గించడానికి తగు సూచనలు, సలహాలు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రజలకు అవగాహన కల్పించడంలో, వారికి న్యాయ సహాయం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. సదస్సులో డాక్టర్ అరుణ, డాక్టర్ దేవకుమార్, డాక్టర్ జయంతి, డాక్టర్ ఝాన్సీవాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, నర్సింగ్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు
– ప్రాణాలతో బయటపడిన డ్రైవర్
మంగళగిరి: నగర పరిధిలోని యర్రబాలెం చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటన సోమవారం జరిగింది. మంగళగిరి నుంచి కృష్ణాయపాలెం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారులో డ్రైవర్ ఒక్కరు మాత్రమే వుండగా వెంటనే కారు డోర్ తీసుకుని కారుపైకి ఎక్కి కాపాడాలని అరవడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అతడిని రక్షించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
యానాదులపై వేధింపులు తగవు
బాపట్ల టౌన్: లైసెన్సుల పేరుతో యానాదులను వేధించడం సరికాదని యానాది హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి లక్ష్మయ్య పేర్కొన్నారు. వేటపాలెం పరిసర ప్రాంతాల్లోని యానాదులు తరతరాలుగా చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మత్స్యశాఖ అధికారుల పేరు చేప్పి కొందరు లైసెన్సుల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వారు వాపోతున్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చి యానాదులు వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని చీలురోడ్డు సెంటర్‌లో రాస్తారోకో చేశారు. పొట్లూరి లక్ష్మయ్య మాట్లాడుతూ.. వేటపాలెం పరిధిలోని నిరుపేద యానాదులు ఎన్నో తరాలుగా చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
లైసెన్సులు లేవనే పేరుతో వేధించడం అప్రజాస్వామికమన్నారు. దీనిపై తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యానాది హక్కుల పరిరక్షణ సమితి బాపట్ల జిల్లా అధ్యక్షులు సీహెచ్ శంకర్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. అనంతరం పట్ణణంలోని చీలురోడ్డు సెంటర్ నుంచి ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్‌కు వినతిపత్రం అందజేశారు. కొమరగిరి శ్రీను, పుట్టా వెంకటేశ్వర్లు, కొమరగిరి అయ్యప్ప, సైకం రమేష్, చేవూరి వెంకట్రావు, మల్లవరపు కృష్ణ, పుట్ట వెంకటేశ్వర్లు, బీఎస్పీ నాయకులు గుదే రాజారావు పాల్గొన్నారు.
యానాదులపై వేధింపులు తగవు
తల్లీబిడ్డకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలి


