బాపట్ల టౌన్: బాపట్ల జిల్లా కేంద్రంలోని యువత మత్తులో జోగుతోంది. తాజాగా మత్తు కోసం ఇంజక్షన్లు చేసుకునే స్థాయికి దిగజారారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఈ తతంగం జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ తరహా యువతకు అడ్డాగా మారింది. ప్రతి రోజు సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో కొందరు యువకులు పరస్పరం మత్తు ఇంజక్షన్లు చేసుకోవడం షరా మామూలైంది. కొద్ది సేపటికి ఇష్టమొచ్చినట్లు కేకలు వేయటం, అటుగా రాకపోకలు సాగించే స్థానికులను భయభ్రాంతులకు గురిచేయటం పరిపాటిగా మారింది. మూడు రోజుల క్రితం మండలంలోని వెదుళ్ళపల్లి సమీపంలో ఓ మహిళ మత్తు కోసం టాబ్లెట్లు పొడిని విక్రయిస్తుండగా స్థానికుల ఫిర్యాదుతో ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన మరవక ముందే తాజాగా మంగళవారం రాత్రి కొందరు యువకులు జమ్ములపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి చేరి ఏకంగా మత్తు ఇంజక్షన్లు చేతి నరాలకు చేసుకోవడం పట్టణంలో కలకలం రేపింది.
కొరవడిన పర్యవేక్షణ
విద్యా కేంద్రంగా పేరున్న బాపట్లలో ఎన్నో ప్రముఖ కళాశాలలు ఉన్నాయి. ఇలాంటి యువత కదలికలను పసిగట్టడంలో పోలీస్ శాఖ అడుగడుగునా విఫలం అవుతూనే ఉంది. పట్టణ నడిబొడ్డున మంగళవారం జరిగిన ఘటన కూడా పట్టణంలోని కొందరు రహస్యంగా వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టుచేయటం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మత్తు మందు వినియోగం, సరఫరాపై జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
పట్టించుకోని పోలీసు అధికారులు
ఫ్లైఓవర్ వద్ద నిత్యం మత్తు ఇంజక్షన్ల వాడకం
మైకంలో ఇష్టమొచ్చినట్లు కేకలు
భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు