
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తు సమయంలో ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలవాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. మంగళవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ విపత్తు సమయంలో సీఎం వైఎస్ జగన్ బాధితులకు, రైతులకు అండగా నిలిచారని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను సవరించి ధాన్యం కొనుగోలు చేస్తోందని వివరించారు. ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ.. అధికారులకు సహకరిస్తూ బాధితులకు మరింత అండగా నిలవాలన్నారు.
దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత
విజయవాడ: మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మంగళవారం తెల్లవారుజామున అధికారులు మూసివేశారు. దేవస్థాన బస్సులను రద్దు చేశారు. భక్తుల ద్విచక్ర వాహనాలు, కార్లను కనకదుర్గనగర్ వైపు అనుమతించారు. ఘాట్ రోడ్డులో కొండ రాళ్లు జారిపడే అవకాశం ఉందని భక్తుల రాకపోకలను నిలిపివేశారు. మహామండపం దిగువన భక్తులు తమ వాహనాలను నిలుపుకుని మెట్లు, లిఫ్టు ద్వారా కొండపైకి చేరుకున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
యార్డులో 22,596 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 20,791 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 22,596 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.23,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ.24,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.9,000 నుంచి రూ.21,000 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.13,500 నుంచి రూ.23,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 12,980 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
చెరువుగా మారిన పొలాన్ని చూసి రైతు మృతి
మార్టూరు: తాను సాగు చేస్తున్న పొలం చెరువుగా మారడాన్ని చూసి గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం తాటివారిపాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. అందిన వివరాల మేరకు.. స్థానిక రైతు గంగవరపు మస్తాన్‌రావు (60) ఎకరా రూ.25 వేల చొప్పున తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకొని వారం రోజుల కిందట శనగ విత్తనం నాటాడు. తుఫాన్ కారణంగా పొలం చూసి వద్దామని ఉదయం 11 గంటలకు వెళ్లిన మస్తాన్‌రావు నీటితో చెరువుగా మారిన పొలాన్ని చూసి గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. మస్తాన్‌రావు ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడు మస్తాన్‌రావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు ఒకటిన్నర ఎకరా సొంత భూమి ఉంది.