అన్నమయ్య జిల్లా విభజన అసలెందుకు..?
రాబోయే నియోజకవర్గాల పెంపుతో మరిన్ని సమస్యలు...
రాయచోటి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను రెండుగా విభజించాలని చూడడం తగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జిల్లాను 6 నియోజకవర్గాలతో యథావిధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విభజన, జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. లేఖ ప్రతిని ప్రభుత్వానికి చేరవేయాలని కోరుతూ గురువారం శ్రీకాంత్ రెడ్డి పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి రాయచోటి కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎన్నికల హామీ మేరకు ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయడం జరిగిందన్నారు. అన్నమయ్య జిల్లా 2022 ఏప్రిల్ 4వ అధికారికంగా ఏర్పడిందన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా పాత చిత్తూరు మరియు వైఎస్సార్ జిల్లాల నుంచి ఈ కొత్త జిల్లాను ప్రకటించిందన్నారు. అప్పటి ప్రభుత్వం 6 కమిటీలను నియమించిందని, అప్పటి ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని, అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్, కృష్ణబాబు, విజయ్ కుమార్ తదితరులు కమిటీలకు అధ్యక్షత వహించి, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఎప్పుడైతే 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన పరిశీలన చర్యలు చేపట్టి ఆయా ప్రాంతంలో మహనీయుల వ్యక్తులను గుర్తించి శ్రీ సత్యసాయి, అన్నమయ్య, బాలాజీ, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ వంటి పేర్లతో జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. ఇందులో భాగంగానే కమిటీ సిఫారసు మేరకు అన్ని రంగాల్లో వెనుకబడి ఉండి, అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండి, అభివృద్ధి చెందవలసిన ప్రాంతమైన రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయడం ఎంతో సంతోషాన్ని , మనో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. జిల్లా అభివృద్ధిపై తాము ఏదైతే కలలు కన్నామో ఆదిలోనే ఆటంకం కలగడం చాలా బాధగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు గెజిట్ ఇచ్చారన్నారు. ఇందులో 60 శాతం భూభాగాన్ని ఇంకో జిల్లాకు ఇచ్చి కేవలం 40శాతం భూభాగం ఉండేలా చేసి, రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా చేసి , జిల్లా కేంద్రాన్ని ఒక కార్నర్‌గా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ రాయచోటి మరియు లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలు దశాబ్దాలుగా తీవ్రమైన కరువుతో బాధపడుతున్న ప్రాంతాలని, రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించబడిన తరువాత కొంత అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రజల్లో కూడా భవిష్యత్తులో అభివృద్ధి జరుగుతుందనే ఆశ ఏర్పడిందని, ప్రస్తుతం కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా విభజనపై సీఎం చంద్రబాబు పునరాలోచన చేసి జిల్లాను యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రస్తుత 175 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు భవిష్యత్తులో 225కు పెరుగుతాయని, 2026లో జనగణన అనంతరం ఈ అమలు జరుగుతుందన్నారు. రాయలసీమకు 16–17 కొత్త నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉండటంతో కొత్త జిల్లాల డిమాండ్లు, సరిహద్దు మార్పులు వంటి అంశాలు మళ్లీ వస్తాయన్నారు. ఇటువంటి సమయంలో జిల్లాను మూడేళ్లకే ఎందుకు విభజించాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు. రాయచోటికి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేశామని, కలెక్టర్ బంగ్లా నిర్మాణ పనులు కూడా ఇప్పటికే పూర్తవుతున్నాయన్నారు. నూతన కలెక్టరేట్‌కు 100 ఎకరాలు, యూనివర్సిటీకి 100 ఎకరాలు , శిల్పారామం కోసం, నగరవనం కోసం, ఎంఐజీ లేఔట్ కోసం రూపాయి ఖర్చు లేకుండా వేలాది ఎకరాలు భూములు సేకరించి ఇవ్వడం జరిగిందన్నారు. అటువంటిది రాష్ట్రంలోనే చిన్న జిల్లాగా కావడం, అది కూడా జిల్లా కేంద్రం ఒక కార్నర్‌కు రావడం చాలా బాధగా ఉందన్నారు. శతాబ్ద కాలం తరువాత రాయలసీమ చరిత్రలో మరో నూతన జిల్లా ఏర్పాటు అయ్యిందన్న సంతోషం చాలా రోజులు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాను యథాతథంగా కొనసాగించాలి
జిల్లా ఏర్పడిన మూడేళ్లకే విభజించి, రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా చేయడం అన్యాయం
వాటర్ గ్రిడ్, ఇరిగేషన్, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
జిల్లా విభజనపై పునరాలోచించాలనిసీఎంకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి లేఖ
కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు లేఖప్రతిని అందించిన వైనం
మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి ప్రాంతాల్లో తీవ్రమైన తాగునీటి సమస్యలు ఉన్నాయన్నారు. వాటర్ ట్రాన్స్ పోర్టును అధిగమించాలని 2022లో డిజైన్లు చేయించి, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు విన్నవించగా జల జీవన్ మిషన్ కు జీవో ఎంఎస్ నంబర్ 565 ద్వారా రూ.2370 కోట్లను తాగునీటి ప్రాజెక్టును మంజూరు చేశారని గుర్తు చేశారు. 3 నియోజకవర్గాలకు గండికోట నుంచి, రాయచోటి నియోజకవర్గంలోని 904 పల్లె ప్రాంతాలకు వెలిగల్లు నుంచి శాశ్వత తాగునీటి సరఫరా జరిగేలా పనులు మంజూరు చేయించామన్నారు. వెలిగల్లు నుంచి పాపాగ్నికి చాలా తక్కువగా ప్లో ఉంటుందని, చెయ్యేరు, బహుదా, పాపాగ్ని నదులు ఎక్కువగా వర్షాలు వస్తేనే నీళ్లు ఉండే పరిస్థితులు ఉంటున్నందున రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించామని తెలిపారు. రైతుల కోసం 27 టీఎంసీలు ఉండే గండికోట నుంచి కాలేటి వాగు ద్వారా వెలిగల్లుకు, వెలిగల్లు నుంచి కంచాలమ్మ గండికి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కెనాల్ ద్వారా చిన్నమండెం మండలంలోని చెరువులకు నీరు అందించాలని , ఝరికోన నుంచి శెట్టిపల్లె గ్రామంలోని చెరువులకు నీరు అందించే పనులు, కాలేటి వాగు నుంచి లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లోని చెరువులకు నీరు అందించే పనులు టెండర్లు పిలిపించి జీవోలు ఇప్పించి పనులను ప్రారంభింప చేశామన్నారు. కరోనా వివిధ పరిస్థితులు వల్ల పనులు ఆలస్యమైనా, పనులను ఒక రూపుకు తెచ్చామన్నారు. వాటర్ గ్రిడ్ పనులు, వెలిగల్లు –గండికోట పనులు జరగాలన్న వివిధ ప్రాజెక్టులు పూర్తి అమలులోకి రావాలంటే జిల్లా యథాతథంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకుని అన్నమయ్య జిల్లా ప్రజల, రైతుల ఆకాంక్షలను వమ్ము చేయకుండా అన్నమయ్య జిల్లాను యథాతథంగా కొనసాగించాలని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో శ్రీకాంత్ రెడ్డి కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహ్మాన్, వైఎస్సార్‌సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, పట్టణ కన్వీనర్ నవాజ్, గాలివీడు మండల కన్వీనర్ యధుభూషణ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రమేష్ రెడ్డి, కౌన్సిలర్లు షబ్బీర్, అన్నా సలీం, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరం వెంకట సుబ్బారెడ్డి, మాజీ జిల్లా విజిలెన్స్ మానటరింగ్ కమిటీ సభ్యులు చుక్కా అంజనప్ప, సగినాల శివశంకర్, నాయకులు జూలూ, కనపర్తి చెన్నారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు పూలుకుంట జనార్థన్ రెడ్డి, కొత్త పల్లె దేవేంద్రరెడ్డి , మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.


