మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని లైసెన్సు రద్దు
రాయచోటి: మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని లైసెన్సు రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫిరెన్సు హాల్‌లో రహదారులపై భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాలలో మార్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే రహదారులపై ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులపై గుర్తించి బ్లాక్ స్పాట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రహదారులపై భద్రత మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. రహదారులపై తీసుకున్న చర్యలు తదితర అంశాలను వివరించారు. రహదారులపై సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు లేదా ఉదయం ఆరు గంటల లోపు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఎనభైశాతంకుపైగా ప్రమాదాలు జాతీయ రహదారులపైనే జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో జాతీయ రహదారులపై 26 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వీటిపై చర్యలు తీసుకోవడానికి జాతీయ రహదారులు శాఖ, పోలీసు శాఖ, ఆర్టీఓ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రహదారులపై ప్రమాదాలను తగ్గించడానికి ఆర్‌అండ్‌బి, రవాణాశాఖ, ఏపీఎస్ ఆర్టీసీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో అన్ని కళాశాలలలో రహదారులపై భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్టీఓను ఆదేశించారు. సమావేశంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బి శాఖ అధికారి సహదావరెడ్డి, పోలీసు శాఖ అధికారులు, ఆర్టీఓ ప్రసాద్, మున్సిపల్ కమీషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


