ఒంటిమిట్టలో నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాట్లు ప్రారంభం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం దర్శనం కోసం వస్తున్న భక్తుల ఆకలి మూడు పూటల తీర్చడానికి టీటీడీ ప్రారంభించాలనుకున్న నిత్యాన్నదానం కేంద్రానికి కేంద్ర పురావస్తు శాఖ తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా గురువారం రామాలయ ఆవరణలోని నామాల వనం పక్కనే ఉన్న పచ్చని వనంలో 60 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు వైశాల్యం గల ప్రమాద రహిత జర్మన్ షెడ్డుతో టీటీడీ సివిల్ విభాగం అధికారులు నిత్యాన్నదానం కేంద్రం తాత్కాలిక ఏర్పాట్లు ప్రారంభించారు. ఇక్కడ ఒకే సారి 200–250 మంది భక్తులు కూర్చుని భోజనం చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. శాశ్వత నిత్యాన్నదాన కేంద్రానికి కేంద్ర పురావస్తూ శాఖ అనుమతలు ఇచ్చేంత వరకు ఈ ప్రాంతంలోనే నిత్యాన్నదానం జరుగుతుందని టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. అతి త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తాత్కాలిక నిత్యఅన్నదాన కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన వివరించారు.


