31లోగా ఎల్‌పీఎంకు దరఖాస్తులు సమర్పించాలి
రాయచోటి: సొంత భూమి కల్గిన భూ యజమానులు జాయింట్ ఎల్‌పీఎం విభజనకు దరఖాస్తు లను ఈ నెల 31వ తేదీలోగా సచివాలయాలు లేదా మీసేవా కేంద్రాలలో సమర్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక అవకాశం వల్ల డిసెంబర్ 31 వరకు దరఖాస్తు రుసుం రూ.50 మాత్రమే ఉంటుందన్నారు. డిసెంబర్ 31 తరువాత ఈ రుసుం రూ. 550కి పెరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని భూ రికార్డులను సక్రమంగా ఉండటం, భవిష్యత్తులో భూ సంబంధిత అన్ని సేవలు పొందడానికి అత్యంత అవసరమన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా యువత ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రాజ్యలక్ష్మి తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో బుధవారం యువ పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రంగాలలో ప్రావీణ్యం ఉన్న యువత పరిశ్రమల స్థాపన కోసం మరింత ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు, ఎల్డీఎం ఆంజనేయులు, డీఎస్‌డబ్ల్యూఓ దామోదర్‌రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మునియప్ప, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీకృష్ణ, సోషల్ వెల్ఫేర్ ఏఎస్‌డబ్ల్యూ సుహాషిని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్: రాష్ట్ర క్రిస్టియన్ (మైనార్టీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు జిల్లాలో గౌరవవేతనం పొందుతున్న పాస్టర్లందరూ తమ బ్యాంకు వివరాలు, మొబైల్ నంబర్‌లను నవీకరించుకోవాలని జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి ఎస్.ఖాజామొహిద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేస్తున్న రూ.5 వేల నెలవారీ గౌరవవేతనం నేరుగా డీబీటీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నందున పాస్టర్లు తమ ఆధార్‌కార్డు ప్రతితోపాటు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ ప్రతి, మొబైల్ నంబర్ వివరాలను కడపలోని డి–బ్లాక్‌లో ఉన్న జిల్లా మైనారిటీస్ సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈ వివరాలు ఓబీఎంఎంఎస్/ ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయుటకు అత్యంత అవసరమైనవి అయినందున డిసెంబర్ 15లోపు సమర్పించాలని తెలియజేశారు. గడువులోపు వివరాలు సమర్పించని పక్షంలో గౌరవవేతనం జమలో ఆలస్యం లేదా అంతరాయం కలగవచ్చునని స్పష్టం చేశారు.
మదనపల్లె రూరల్: మదనపల్లె జిల్లా ఏర్పాటులో భాగంగా ప్రభుత్వశాఖలకు సంబంధించి అవసరమైన భవనాల కోసం సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి పట్టణంలోని భవనాలను పరిశీలించారు. బుధవారం బెంగళూరు రోడ్డులోని సిరికల్చర్ ఆఫీసు, బీటీ కాలేజీ పీజీ గర్‌ల్స్, బాయ్స్ హాస్టల్, హంద్రీ–నీవా కార్యాలయం తదితర భవనాలను పరిశీలించారు. బీటీ కాలేజీ పీజీ హాస్టల్ సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయి, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో శుభ్రం చేయించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీలను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు సంబంధించి భవనాలను సిద్ధం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. అనువైన భవనాల కోసం వెతుకుతున్నామని సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి తెలిపారు. ఎంపిక చేసిన భవనాలపై నివేదిక జిల్లా కలెక్టర్‌కు పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో మండల ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
31లోగా ఎల్‌పీఎంకు దరఖాస్తులు సమర్పించాలి
31లోగా ఎల్‌పీఎంకు దరఖాస్తులు సమర్పించాలి


