పీఎంఈజీపీతో కలలు సాకారం చేసుకోండి
కురబలకోట: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) అమలు చేస్తోందని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ సౌత్ ఇండియా (కేవీఐసీ) డిప్యూటీ సీఈఓ ఎల్.మదన్‌కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా అంగళ్లు సీఎఫ్‌సీలో టెర్రకోట, చింతపండు ప్రాసెసింగ్, ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త పరిశ్రమల ఏర్పాటుతోపాటు యువతకు ఉపాధి కల్పించడం పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకునే ఔత్సాహికులు సబ్సిడీ రుణాలు పొంది కలలు సాకారం చేసుకోవచ్చన్నారు. నిరుద్యోగులకు ఇది అద్బుత పథకమన్నారు. స్వయం ఉపాధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇది అగ్రగామి పథకమన్నారు. ఎఐలు, కేవీఐసీ, కేవీఐబీ, జిల్లా పరిశ్రమల కేంద్రాల ద్వారా ఈ పథకం అమలు అవుతుందన్నారు. తయారీ రంగానికి గరిష్టంగా రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షల రుణం పొందవచ్చన్నారు. సాంకేతిక, ఆర్థిక సాధ్యతను బట్టి బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. నిబంధనల మేరకు లబ్ధిదారులు నిర్దేశిత వాటా చెల్లించాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 25 నుంచి 35 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. గరిష్టంగా రూ.3.75 లక్షల సబ్సిడీ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ ఎస్.గ్రిప్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్‌ఎల్‌ఎన్ మూర్తి, తిరుపతి రీచ్ సెక్రటరీ కృష్ణమూర్తి, టెర్రకోట హస్త కళాకారుల సంఘం నాయకులు రత్న శేఖర్, దుర్గం మల్లిఖార్జున, దుర్గం శ్రీనివాసులు, పద్మావతి, కళావతి తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు అద్భుత అవకాశం
సబ్సిడీ రుణాలు వినియోగించుకోవాలి
కేవీఐసీ సౌత్ ఇండియా డిప్యూటీ సీఈఓ మదన్‌కుమార్‌రెడ్డి


