ఉద్యమంలా కోటి సంతకాల కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమంలా కోటి సంతకాల కార్యక్రమం

Dec 11 2025 8:10 AM | Updated on Dec 11 2025 8:10 AM

ఉద్యమంలా కోటి సంతకాల కార్యక్రమం

ఉద్యమంలా కోటి సంతకాల కార్యక్రమం

రాయచోటి అర్బన్‌ : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని, మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకురావడం ఒక దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు కుట్రకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్నమయ్య జిల్లాలో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి మేధావులు, యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు కలిసి సంతకాలు చేశారు. ఈ పత్రాలను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు రాయచోటి పట్టణం ఎస్‌ఎన్‌ కాలనీలోని శ్రీకాంత్‌ రెడ్డి కార్యాలయం నుంచి జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి తరలించే వాహనానికి ఆయన జెండా ఊపారు. దీంతో పాటు జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి సంతకాలు చేసిన ప్రతులు బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్ర వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆకేపాటి అమరనాథ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పిలుపుతో కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా సాగిందన్నారు. మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నిస్సార్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ పేదల నోటి దగ్గర కూడును కూటమి ప్రభుత్వం లాగేసుకుంటోందని విమర్శించారు. పుంగనూరు ఇన్‌చార్జి అనూషా రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్‌ కళాశాల కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. అలాంటిది గత వైఎస్సార్‌సీపీ పాలనలోనే 17 మెడికల్‌ కళాశాలలను తీసుకొచ్చి, అందులో 5 మెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభించామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేస్తే మాజీ సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో ప్రైవేటుకు కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మెడికల్‌ కళాశాలల్లో సౌకర్యాలు కల్పించలేమని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గమని విమర్శించారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసే కుట్రలు మానుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

లక్ష్యాన్ని అధిగమించి సంతకాల సేకరణ..

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పెనలా జరిగిందని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. కోటి సంతకాల లక్ష్యంతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో కోటికి పైగానే రాష్ట్రంలో సంతకాలు సేకరించినట్లు తెలిపారు. అందులో భాగంగా రాయచోటి నియోజకవర్గంలో 82 గ్రామాలలోనూ, రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోనూ సుమారు 52 వేల సంతకాలు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. సేకరించిన సంతకాల ప్రతులను బుధవారం వందలాది మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి 15వ తేదీ విజయవాడకు పంపనున్నారు. తరువాత 17వ తేదీన గవర్నర్‌కు నాయకులతో కలిసి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అందజేస్తారని తెలిపారు. కోటి సంతకాల కార్యక్రమాలను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శ్రీకాంత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్దన్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రారెడ్డి, మండల కన్వీనర్లు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, యదుభూషణరెడ్డి, పట్టణ కన్వీనర్‌ నవాజ్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి జాఫర్‌ అలీఖాన్‌, జెడ్పీటీసీలు వెంకట రమణ, వెంకటేశ్వర్లు రెడ్డి, సీనియర్‌ నాయకులు బాబు రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహ్మాన్‌, టైక్రార్‌ మాజీ చైర్మన్‌ గుండా సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగభూషణ రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ రమేష్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీధర్‌ రెడ్డి, నాయకులు రవిశంకర్‌ రెడ్డి, సమరసింహారెడ్డి, సుగవాసి శ్యామ్‌, షబ్బీర్‌, గౌస్‌, మహేష్‌ రెడ్డి, జనతా బషీర్‌, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి రియాజుర్‌ రెహ్మాన్‌, నాగేంద్ర, జంగం రెడ్డి కిషోర్‌ దాస్‌, ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ

నిర్ణయం ఉపసంహరించుకోవాలి

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు పేదల ఆస్తి..

వాటిని పీపీపీ విధానంలోకి తీసుకురావడం దుర్మార్గమైన చర్య

అన్నమయ్య జిల్లా కేంద్రానికి చేరిన

నియోజకవర్గాల సంతకాల ప్రతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement