జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్
పెద్దతిప్పసముద్రం: గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల కొరత, రిజిస్టర్, మౌలిక వసతులు, రక్త పరీక్షా కేంద్రం, ప్రసూతి కేంద్రాలను తనిఖీ చేసి రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి రికార్డులు పక్కాగా ఉన్నా అధికారులు మంజూరు బిల్లులు మంజూరు చేయకుండా అలసత్వం వహిస్తున్నారని సర్పంచ్ సుబ్బిరెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం కలెక్టర్ బూర్లపల్లి జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. ఉపాధ్యాయుల పని తీరు, విద్యా బోధన, మధ్యాహ్న భోజనం అమలు, తాగునీటి సౌకర్యం, వంటగది, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి, తరగతి గదుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రధానంగా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. గత ఏడాది ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉందని వచ్చే ఏడాది జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణత పెంపునకు టీచర్లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీరాములు నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యస్దాని, ఎంఈఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
