
ముత్తూట్ సిబ్బంది చేతివాటం
– సొమ్ము స్వాహా కేసులో ముగ్గురి అరెస్టు
బి.కొత్తకోట : ముత్తూట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. స్థానిక రంగసముద్రంరోడ్డులోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో సొమ్ము జమచేయకుండా స్వాహా చేశారు. ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఇన్‌ఛార్జి సీఐ లక్ష్మన్న తెలిపారు. ఆయన కథనం మేరకు..ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్‌లో మదనపల్లెకు చెందిన దూదేకుల ఇమ్రాన్‌బాషా(30), పెద్దతిప్పసముద్రం మండలం మల్లెలకు చెందిన జరిపిటి హరీష్(29), బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీకి చెందిన ముగిలన్నగారి హరికృష్ణ (26) వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కార్యాలయంలో బంగారు ఆభరణాలను కుదవపెట్టే ఖాతాదారులతో సొమ్ము వసూలు చేసినా.. బ్రాంచీలో జమ చేయకుండా స్వాహా చేస్తున్నారు. కొందరు ఖాతాదారులు ఇటీవల నగలు విడిపించుకునేందుకు రాగా ఇంకా రుణం పెండింగ్‌లో ఉందని, చెల్లిస్తే ఇస్తామని చెప్పడంతో ఖంగుతిన్నారు. ఈ విషయం దావానలంలా అందరికీ తెలియడంతో కొందరు ఖాతాదారులకు అనుమానం కలిగి తమ రుణాలపై ఆరా తీయగా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ విషయం సంస్థ ఉన్నతాధికారులకు చేరడంతో విజిలెన్స్ బృందంతో విచారణ చేయించారు. అనుమానించినట్టుగానే ఆ ముగ్గురు సిబ్బంది రూ.65.76 లక్షలు ముత్తూట్ సంస్థకు జమ చేయకుండా స్వాహా చేశారని తేలడంతో చర్యలు చేపట్టారు. రీజనల్ ఫైనాన్స్ మేనేజర్ ఎస్.దేవరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ముగ్గురిని మండలంలోని హార్సిలీహిల్స్ క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
విభిన్న ప్రతిభావంతులకు
ప్రత్యేక ఉపకరణాలు
కడప ఎడ్యుకేషన్ : విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఉపకారణాలు అందించినట్లు జోన్ 4 పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్‌జేడీ) కాగిత శామ్యూల్ అన్నారు. స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు బుధవారం ఉపకారణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో ఉపకరణాలు తయారుచేసి అందిస్తోందన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అర్హులను గుర్తించి వీల్ చైర్స్, సీపీచైర్స్, రోలేటర్స్ అందించామని తెలిపారు. ఉపకారణాలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానంద రాజు, విభిన్న ప్రతిభవంతుల శాఖ జిల్లా సంచాలకులు కృష్ణ కిశోర్ మాట్లాడుతూ ఉపకారణాలతో దివ్యాంగులు తమ లోపాలు అధిగమించి రాణించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌కుమార్, రమణమూర్తి, కేశవరెడ్డి, విశ్వనాథరెడ్డి, వీరేంద్ర, మమత, విజయమ్మ, పద్మ, గంగులప్ప, చంద్ర, రాజా, తదితరులు పాల్గొన్నారు.