
శిక్షణా కేంద్రం అభివృద్ధికి సహకరించండి
మదనపల్లె రూరల్ : హార్సిలీహిల్స్‌లోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం అభివృద్ధికి సహకరించాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులు కోరారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, స్కౌట్ అధికారులు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌ను ఆయన కార్యాలయంలో బుధవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1959 మే, 23న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భీమసేన్ సాచార్ హార్సిలీహిల్స్‌లోని శిక్షణ కేంద్రానికి స్థలాన్ని కేటాయించడం జరిగిందని వివరించారు. అప్పటి నుంచి 8 జిల్లాలకు చెందిన రాయలసీమ విద్యార్థులేగాక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు శిక్షణ పొందడం జరిగిందన్నారు. ప్రహరీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, స్కౌట్ భవనానికి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ హార్సిలీ హిల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్థలానికి సంబంధించిన వివరాలు తెప్పించుకుని దాని అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, జాయింట్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ మహమ్మద్ ఖాన్, బేసిక్ స్కౌట్ మాస్టర్స్ చంద్రశేఖర్ రెడ్డి, అన్వర్ బాషా, లక్ష్మీపతి, కబ్ మాస్టర్స్ భూపతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.