
సమస్యలు పరిష్కరించేంత వరకు ఖాళీ చేసేది లేదు
ఓబులవారిపల్లె : మండలంలోని కాపుపల్లి, హరిజనవాడ, అరుంధతివాడ పునరావాస గ్రామాల్లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేంతవరకూ ఖాళీ చేసేది లేదని ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. స్థానిక ఎంపీడీఓ సభా భవనంలో మంగంపేట గ్రామస్థులతో తహసీల్దారు శ్రీధరరావు, సీపీవో సుదర్శన్‌రెడ్డి, తదితరులు అభిప్రాయ సేకరణ నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పునరావాస కాలనీలో రామాలయ నిర్మాణం గ్రామ ఆలయ కమిటీకి అప్పగించాలని కోరారు. 72 ఎకరాల శ్మశాన స్థలాన్ని ఎపీఎండీసీ తీసుకని, రెండు ఎకరాలు మాత్రమే శ్మశానానికి ఏ విధంగా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. అన్ని కులాలకు 40 ఎకరాల స్థలం ఉండాలన్నారు. రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 750కి పైగా కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని, 150 కుటుంబాలకు పరిహారం అందించాల్సి ఉందన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు గుత్తిరెడ్డి హరినాథరెడ్డి, సర్పంచ్ మినుగు సుధాకర్, గ్రామస్థులు గుజ్జల శ్రీనివాసులురెడ్డి, కౌలూరు రమణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, దేవకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.