
నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం
కడప కార్పొరేషన్ : కడప నగరం మద్రాసు రోడ్డులోని డాక్టర్ వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో లీజుకు ఉన్న వ్యాపారులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులు తొలగించడం అన్యాయమని మేయర్ సురేష్ బాబు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి నగరపాలక అధికారులు తొలగించిన షాపులను పరిశీలించి, వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, హత్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. మహిళలని చూడకుండా అనంతపురం, వైజాగ్, గుంటూరు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారని, హత్యలు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి రెడ్‌బుక్ పాలన పాలన సాగిస్తున్నారని, 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి అరాచక పాలన లేదన్నారు. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే కడపలో మరొక ఎత్తుగా ఉందన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి గొంతునొక్కే విధంగా కక్ష సాధిస్తున్నారన్నారు. నగర ప్రథమ పౌరుడినైన తన ఇంటిపైనే చెత్త వేయించారని, ప్రశ్నించే వారు ఉండకూడదని వారి నోరు నొక్కేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో 10 గదులు ఉన్నాయని, 2007లో వీరంతా బహిరంగ వేలంలో రూ.7.50 లక్షలు చెల్లించి లీజుకు తీసుకున్నారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వ్యాపారం జరిగినా, జరక్కపోయినా, కోవిడ్ సమయంలోనూ బాడుగ చెల్లిస్తూ ఉన్నారన్నారు. వీటిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డికి కూడా ఒక గది ఉందని, ఆయన్ను లక్ష్యంగా చేసుకొని అందరి షాపులు ధ్వంసం చేయడం దారుణమన్నారు. గదుల పక్కనే కార్పొరేషన్ నిర్మించిన పబ్లిక్ టాయ్‌లెట్లు, ఉర్దూ పాఠశాల ప్రహరీ వీటికంటే ముందుకు ఉన్నాయని మీడియాకు చూపారు. వ్యాపారులు ట్రేడ్‌లైసెన్స్, అడ్వర్‌టైజ్‌మెంట్ ట్యాక్స్, ఎన్‌క్రోచ్‌మెంట్ ట్యాక్స్ చెల్లిస్తున్నప్పటికీ ఆక్రమణల పేరిట తొలగించడం అన్యాయమన్నారు. కడపలో ముడుపులు చెల్లించలేదని వెంచర్లను నిషేధించారని, గతంలో ఏడాదికి 3వేలకు పైగా ప్లాన్ అప్రూవల్స్ అయ్యేవని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి దానికి కప్పం కట్టాల్సి రావడం వల్లే ఈ ఏడాది 500 అప్రూవల్స్ కూడా కాలేదన్నారు. నగరపాలక అధికారుల వల్ల నష్టపోయిన వ్యాపారులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, వారికి నష్ట పరిహారం ఇప్పించడానికి న్యాయ పోరాటం చేస్తామన్నారు.
నాపై ఉన్న కక్షతో ఇతరుల జీవనోపాధి దెబ్బతీయడం దారుణం– జయచంద్రారెడ్డి
తనపై కక్ష ఉంటే నా గదులు మాత్రమే తొలగించాలిగానీ, పక్కనున్నవారి షాపులు కూడా తొలగించి వారి జీవనోపాధి దెబ్బతీయడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 60 అడుగుల రోడ్డు ఉంది, నాగులపుట్ట, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయ్‌లెట్లు, పాఠశాల ప్రహరీ కంటే లోపలే షాపులు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేసే వారి గొంతు నొక్కాలనే ఇలా చేశారన్నారు. సాయంత్రవేళ అంగళ్లన్నీ మూసిన తర్వాత కూల్చివేయడం అన్యాయమన్నారు. సూర్యనారాయణ వల్లే తాను కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నానే తప్పా, వారిలాగా వేరే పార్టీ కండువా కప్పుకోలేదన్నారు. ఆడిటోరియం బయట, నెహ్రూపార్కు బయట ఉన్న షాపుల వద్ద సూర్యనారాయణరావు డబ్బులు వసూలు చేశాడన్నది అక్షర సత్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్, యానాదయ్య, శ్రీరంజన్‌రెడ్డి, బీహెచ్ ఇలియాస్, ఐస్‌క్రీం రవి, త్యాగరాజు, దేవిరెడ్డి ఆదిత్య, సింధు, దాసరి శివ, షఫీ, రామ్మోహన్‌రెడ్డి, బసవరాజు, సుబ్బరాయుడు, శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, కె. బాబు, చెన్నయ్య, రెడ్డి ప్రసాద్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కొక్కరికి రూ.2లక్షల మేర నష్టం
వ్యాపారులకు వైఎస్సార్‌సీపీ
అండగా ఉంటుంది
రాష్ట్రమంతా ఒక రకమైన పాలన.. కడపలో మరో రకమైన పాలన
మేయర్ సురేష్ బాబు మండిపాటు