రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

May 19 2025 2:06 AM | Updated on May 19 2025 2:06 AM

రాష్ట

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి

పెద్దతిప్పసముద్రం : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని పక్కన బెట్టిన చంద్రబాబు రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ కుయుక్తులు పన్నుతున్నారని మండి పడ్డారు. ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను తుంగలో తొక్కి డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపుతున్నారన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు రిటైర్డ్‌ అధికారుల మీద కూడా కక్ష గట్టి తప్పుడు కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించిన వారే ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారన్నారు. పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడం వల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ ఈడీల దర్యాప్తులో చంద్రబాబు స్కిల్‌ స్కాంలో అడ్డంగా దొరికి జైలుకు వెళితే ఇదంతా కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయించాడని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కక్ష పూరిత చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు.

బాలిక అదృశ్యం

పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లుకు చెందిన ఓ మైనర్‌ బాలిక (16) ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఊళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ హరిహర ప్రసాద్‌ తెలిపారు.

మాటలకే స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర

– ఎగువ అబ్బవరం కాలనీలో

తొలగని మురుగునీరు

రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెత్తరహిత ప్రాంతాలుగా మార్చాలని చెబుతున్నా స్థానిక మున్సిపల్‌ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన వీధులు మినహా మిగిలిన వీధులలో ఎక్కడికి వెళ్లినా బురదమయమైన రహదారులు ముక్కుపుటాలు అదిరే దుర్గంధం వెదజల్లే చెత్తకుప్పలు కనిపిస్తాయి. శనివారం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ మున్సిపల్‌ అధికారులు కలిసి స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎగువ అబ్బవరం కాలనీ(33వ వార్డు)లో మున్సిపల్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్వచ్ఛ ఆంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదు. కాలనీలోని రోడ్లు చెత్తా చెదారం, మురికినీటితో నిండిపోయాయని ఆ వార్డు ప్రజలు వాపోతున్నారు. అబ్బవరం కాలనీలో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేక పోతున్నామని చెబుతున్నారు. వర్షం వస్తే మురుగునీటి కాలువలు లేక మురుగునీరు రోడ్ల మీదనే ప్రవహిస్తుంది. మలేరియా లాంటి వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

షోకాజ్‌ నోటీసులు

అందుకున్న తహసీల్దార్‌

లింగాల : లింగాల మండల తహసీల్దార్‌గా 2022 నుంచి 2024 వరకు పనిచేసిన లక్ష్మీనారాయణ షోకాజ్‌ నోటీసులు అందుకున్నారు. 20 ఏళ్ల కాల పరిమితితో అసైన్డ్‌ భూములపై రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేయడంలో 2003 సంవత్సరానికి ముందు ఉన్న భూములను చేయాల్సి ఉంది. అయితే లక్ష్మీనారాయణ 2024–25 సంవత్సర భూములను కూడా ఫ్రీ హోల్డ్‌ చేశారని విచారణలో తేలింది. మండలంలోని లోపట్నూతల, లింగాల, కామసముద్రం గ్రామాల్లోని 76 ఎకరాల అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేయడంపై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ప్రస్తుత తహసీల్దార్‌ ఈశ్వరయ్య తెలిపారు.

పశువులు మేపుకునేందుకు వెళ్లి..

– పిడుగుపాటుకు వ్యక్తి మృతి

చాపాడు : మండల పరిధిలోని పల్లవోలు గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగు పడి బాలాయపల్లె సుబ్బ రమణయ్య(40) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలోని దళితవాడకు చెందిన బాలాయపల్లె సుబ్బరమణయ్య అలియాస్‌ సుబ్రమణ్యం శనివారం సాయంత్రం గేదెలు మేపుకునేందుకు గ్రామ సమీపంలోని స్మశానవాటిక దగ్గర ఉండే పొలాల్లోకి వెళ్లాడు. ఇతనితో పాటు సమీపంలో మరికొంత మంది మహిళలు గేదెలను మేపుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతను పడిపోయిన స్థలం వద్ద పశువులన్నీ గుంపుగా ఉండటంతో గుర్తించిన సమీపంలోని మహిళలు అతని వద్దకు వెళ్లారు. వెంటనే ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ఆదిలక్ష్మితో పాటు యుక్త వయస్సుకు వచ్చిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిడుగు పాటుకు సుబ్బరమణయ్య మృతి చెందటంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం 
1
1/1

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement