
ఈత సరదాకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి
కలికిరి : ఈత సరదాకు కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి బలైన దుర్ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జేఎన్టీయూ కళాశాల నుంచి శనివారం మధ్యాహ్నం సుమారు పది మంది విద్యార్థులు కళాశాల సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు ఈతకెళ్లారు. ఈత వచ్చిన వారు ఈత ఆడుతుండగా ఈత రాని వారు గట్టుపై కూర్చుని చూస్తున్నారు. ఈ క్రమంలో సివిల్ ఇంజిరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన సూర్యనారాయణ కుమారుడు చింతా రాకేష్(18) ఈతకు పై నుంచి దూకాడు. దీంతో పూడిక మట్టిలో ఇరుక్కుపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడటానికి ప్రయత్నించినా ఉపయోగం లేక పోవడంతో కళాశాలకు వెళ్లి అధ్యాపకులకు, సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పీలేరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సాయంతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ మదన్‌మోహన్ రెడ్డి తెలిపారు.
విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కరువు...
జేఎన్టీయూ కళాశాల విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కరువవ్వడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు నిత్యం కళాశాల బయటకు వెళ్తూ వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి సమయాల్లోనూ ఇలాగే జరుగుతోందని, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బందిపై మండిపడ్డారు. గతంలోనూ ఇలా ఓ విద్యార్థి ఈతకెళ్లి మృతి చెందినా కళాశాల అధికారులకు కనువిప్పు కలగలేదని చెప్పారు.

ఈత సరదాకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి