
కోడి కత్తితో అన్నావదినలపై దాడి
నిమ్మనపల్లె : అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత కక్షలు కత్తులతో దాడి చేసుకునే వరకూ దారి తీశాయి. మాటామాటా పెరిగి క్షణికావేశంలో కోడి కత్తితో సొంత తమ్ముడే.. అన్నా, వదినలపై దాడికి దిగారు. తీవ్రగాయాలతో వారు ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ పంచాయితీ యానాది కాలనీకి చెందిన ఎర్రప్ప(30), శ్యామల(24) నిమ్మనపల్లె మండలం బండ్లపై పంచాయతీ దుర్గంవారిపల్లె వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎర్రప్పకు గత కొద్ది రోజులుగా తమ్ముడు హనుమంతుతో వ్యక్తిగత వివాదాలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఎర్రప్ప తన భార్య శ్యామలతో కలిసి సొంత పనులపై బండ్లపై గ్రామానికి వచ్చారు. తిరిగి రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో దుర్గంవారిపల్లె పొలం వద్దకు వెళ్తున్నారు. తన అన్న వచ్చిన విషయం తెలుసుకున్న మార్గమధ్యంలో శివాలయం వద్ద ఎర్రప్ప తమ్ముడు హనుమంతు, తన స్నేహితుడు అశోక్, మరో వ్యక్తితో కలిసి వాహనాల్లో దారి కాచారు. ఎర్రప్ప రాగానే అడ్డగించి కోడి కత్తులతో అన్నా, వదినలపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎర్రప్ప భార్యకు తీవ్ర గాయాలవడంతో స్థానికుల సాయంతో పిట్టావాండ్లపల్లెలో ప్రాథమిక చికిత్స చేయించుకుని 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య, భర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, నిమ్మనపల్లె ఎస్సై తిప్పేస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.

కోడి కత్తితో అన్నావదినలపై దాడి