
ఘనంగా శ్రీ రెడ్డెమ్మతల్లి విగ్రహ పునఃప్రతిష్ట
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లెలో వెలసిన సంతాన ప్రదాయిని రెడ్డెమ్మతల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ పున:ప్రతిష్ట గురువారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని ఇటీవల రూ.2.50 కోట్లతో పునర్నిర్మించారు. రెండు రోజులుగా నూతన విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఆలయంలో ప్రాతఃకాలపూజ, దేవతా ఉత్తాపనం, పంచామృతాభిషేకం, గర్త సంస్కారం నిర్వహించారు. పది గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రతిష్టా హోమం, ప్రాణప్రతిష్ట, కళాన్యాస హోమం, కళాన్యాసం, నేత్రోన్మీలనం, అలంకారం, కూష్కాండబలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గ్రామస్థులు చేరుకుని అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, ఈవో మంజుల, దాతలు రెడ్డిపరంజ్యోతి, వీరాంజనేయప్రసాద్, సర్పంచులు ప్రేమకుమారి, ఆనంద్, ప్రసాద్‌నాయుడు, ఎల్లుట్లమురళీ, చలమారెడ్డి, సుంకరశేఖర, సాకే చిన్నప్ప, నౌషాద్‌ఆలీ, పూజారి రెడ్డెప్పలు పాల్గొన్నారు.